Palakurthy: పాలకుర్తిలో రేవంత్‌రెడ్డి కొత్త ప్రయోగం.. ఈసారి జెండా పాతేదెవరు?
మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాలకుర్తిలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఓ ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎర్రబెల్లితో సమరానికి రెడీ చేస్తున్నారు.

who will win in palakurthi assembly constituency?
Palakurthi Assembly Constituency: 40 ఏళ్ల రాజకీయం.. ఒక్కసారీ ఓటమి ఎరుగని అనుభవం.. అధికార పార్టీ అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్న నేత ఒకవైపు.. అసలు ఎలాంటి రాజకీయం అనుభవం లేని.. క్షేత్రస్థాయిలో పెద్దగా పరిచయం లేని మహిళా నేత మరొక వైపు.. అధికార బీఆర్ఎస్‌లో ఎదురేలేని నేత ఎర్రబెల్లి.. పార్టీ చీఫ్ అండదండలతో పోటీకి సై అంటున్న కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి మధ్య ఆసక్తికర సమరానికి వేదిక కాబోతోంది పాలకుర్తి.. ప్రాచీన సాంస్కృతిక నేపథ్యం ఉన్న పాలకుర్తిలో తాజా రాజకీయం గరంగరంగా మారుతోంది.. మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాలకుర్తిలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఓ ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎర్రబెల్లితో సమరానికి రెడీ చేస్తున్నారు. దీంతో పాలకుర్తి పోరు ఆసక్తిరేపుతోంది. ఈ రసవత్తర పోరులో గెలిచేది ఎవరు? పాలకుర్తిపై జెండా పాతేదెవరు?
పాలకుర్తి అంటేనే చైతన్యం. తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాట స్ఫూర్తికి అడ్డాగా నిలిచింది పాలకుర్తి. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బంధగి వంటి అమరుల వీరత్వం ఈ నియోజకవర్గం సొంతం. బమ్మెర పోతన, పాల్కురి సోమనాథుడు పుట్టిన గడ్డ కూడా ఇదే. ఒకవైపు సాయుధ విప్లవం.. మరోవైపు ప్రాచీన సాహిత్యంతో మమేకమైన పాలకుర్తి ప్రాంతం చైతన్యానికి మారుపేరుగా నిలుస్తోంది… ఒకప్పుడు చెన్నూరు నియోజకవర్గంగా పరిధిలో ఉండే పాలకుర్తి.. 2009లో కొత్తగా ఏర్పాటైంది. అప్పటివరకు వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. 2009 నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. సుమారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమన్నది ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు ఎర్రబెల్లి.
అత్యధికంగా బీసీ ఓటర్లు
1957లో చెన్నూరు నియోజకవర్గం ఏర్పడితే.. 2009లో డీలిమిటేషన్ తర్వాత అది పాలకుర్తిగా అవతరించింది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 37 వేల 750 మంది ఓటర్లు ఉన్నారు. తొర్రూరు మున్సిపాలిటీతోపాటు తొర్రూరు గ్రామీణ, పెద్దవంగర, కొడకండ్ల, పాలకుర్తి, రాయపర్తి, దేవరుప్పుల మండలాలు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్నారు. గెలుపు ఓటములను నిర్దేశించేది వీరే. ఇందులో గొల్లకురుమలు అత్యధిక శాతం ఓట్లను కలిగి కీలకంగా ఉండగా తరువాత స్థానంలో గౌడ, ముదిరాజ్, పద్మశాలీ సామాజిక వర్గాలు కీలక భూమిక పోషించనున్నారు. పార్టీల గెలుపును నిర్దేశించడంలో ప్రధానంగా ఎస్టీ లంబాడాలు, ఆతర్వాత ఎస్సీల పాత్రే నియోజకవర్గంలో కీలకం. తొర్రూరు మండలం, మున్సిపాలిటీలో 62 వేల 264 ఓట్లతో విజేతలను నిర్ణయిస్తుంది.

Errabelli Dayakar Rao (Photo: Google)
ఓటమెరుగని ఎర్రబెల్లి
ఓటమెరుగని నేతగా పేరున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 2009 పాలకుర్తి నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు కాంగ్రెస్ నేత యతిరాజారావు, ఆయన భార్య విమలాదేవి విజయం సాధించారు. ఇక టీడీపీ అత్యధికంగా ఆరు సార్లు విజయం సాధించింది. టీడీపీ తరఫున యతిరాజారావు మూడు సార్లు, ఆయన కుమారుడు సుధాకర్ ఒకసారి, ఎర్రబెల్లి దయకార్ రావు రెండు సార్లు జయకేతనం ఎగురవేశారు. ఇక యతిరాజారావు కుటుంబమే తొమ్మిది సార్లు గెలిస్తే.. ఆ తర్వాత అత్యధిక విజయాలు ఎర్రబెల్లి సొంతం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు అభివృద్ధిపై ఒక విజన్తో ముందుకెళ్తూ నియోజకవర్గ ప్రగతికి బాటలు వేస్తున్నారు. ప్రధానంగా 2018 నుంచి అనూహ్య ప్రగతికి పాలకుర్తి కేరాఫ్ గా మారింది. వర్ధన్నపేట నుంచి పాలకుర్తికి షిఫ్ట్ అయిన ఎర్రబెల్లి నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. తెలంగాణ వాదం, ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాభిమానంతో పట్టు నిరూపించుకున్నారు.

Hanumandla Jhansi Reddy (Photo: Facebook)
ఝాన్సీరెడ్డికే రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
ఓటమి ఎరుగని నేతకు చుక్కలు చూపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారు. టీడీపీలో ఉన్నప్పటి నుండే ఎర్రబెల్లి, రేవంత్‌కు మధ్య ఆధిపత్య పోరు సాగేది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంతో ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నుంచి దీటైన అభ్యర్థిని నిలబెట్టి సత్తా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా దయకర్ రావుకు సమ ఉజ్జీగా ఉన్న ఎన్ఆర్ఐ అనుమాండ్ల ఝాన్సిరెడ్డిని బరిలో నిలిపేందుకు ప్లాన్ చేస్తున్నారు రేవంత్ . మరో ఎన్ఆర్ఐ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి టికెట్ ఆశిస్తున్నా.. ఝాన్సీరెడ్డికే రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తొర్రూరు మండలం చెర్లపాలెం సహా పలు ప్రాంతాల్లో సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేపట్టారు ఝాన్సీరెడ్డి. అందుకే ఆమెను ఛాయిస్ గా ఎంచుకుంది కాంగ్రెస్.
Also Read: నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7లోగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ పోలింగ్ డిసెంబర్ 7?

Thirupathi Reddy YerramReddy (Photo: Facebook)
ఝాన్సీరెడ్డిపై తిరుపతిరెడ్డి తిరుగుబాటు!
ఇక పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ అందుకోవడంతో ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలుపెట్టేశారు. ఐతే ఝాన్సీరెడ్డికి ఆదిలోనే హంసపాదులా సవాల్ విసురుతున్నారు మరో ఆశావహుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి. ఇదే సమయంలో బీసీ నేతలు కూడా ఝాన్సీరెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి మాత్రమే పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని, బీసీలను పక్కన పెడుతున్నారనే ఝాన్సీరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో చేరిన తొలినాళ్లలోనే గ్రూపు తగాదాలు, బీసీ వర్గాల తిరుగుబాటుతో ఝాన్సీకి తలబొప్పి కడుతోంది. మరోవైపు మంత్రి దయాకర్ రావును గెలిపించడం కోసమే ఝాన్సీరెడ్డి తెరపైకి వచ్చారని.. ఆమె దయాకర్ రావు కోవర్టు అంటూ మరో ఆశావహుడు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.

Peddagani Somaiah (Photo: Facebook)
బీజేపీలో కనబడని జోష్
ఇక బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చినప్పటికీ తాజా రాజకీయ మార్పులతో బీజేపీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు. కమలం పార్టీ నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన పెద్దగాని సోమయ్య పోటీలో ఉండవచ్చేనే ప్రచారం జరుగుతోంది.. తొర్రూరు సర్పంచ్గా పనిచేసిన అనుభవం, సీనియర్ నేతగా గుర్తింపు, ప్రజలతో సత్సంబంధాలతో గెలవాలని ప్లాన్ చేస్తోంది బీజేపీ.. అదేవిధంగా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త లేగా రామ్మోహన్ రెడ్డి కూడా బీజేపీ టికెట్‌పై పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తారనే స్పష్టత మాత్రం పూర్తి స్థాయిలో లేదు. ఏదైనప్పటికీ పార్టీకి పెద్దగా క్యాడర్ లేకపోవడంతో నామమాత్రంగా పోటీ ఇచ్చే పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది.
Also Read: పార్టీ మార్పు వార్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
ఇలా మూడు పార్టీల మధ్య పోటీ జరిగే పరిస్థితి కనిపిస్తున్నా.. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ జరిగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి దయాకర్‌రావు పోటీ చేయనుండటం.. ఆయన ఇంతవరకు ఓడిపోయిన చరిత్ర లేకపోవడంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలకుర్తిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయ పరంపర కొనసాగించేలా ఎర్రబెల్లి.. ఆయనను ఓడించి తన కసి తీర్చుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్.. సీనియర్ నేతపై గెలవాలని ఝాన్సీరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఆకర్షిస్తున్నాయి. ఈ హోరాహోరీ పోటీలో ఓటర్లను ఎవరిని ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.