ఉద్యోగంపై కన్నేసిన కొడుకు, ప్రియుడి మోజులో కూతురు, పిల్లల కోసం తల్లి.. అంతా కలిసి చంపేశారు

  • Published By: naveen ,Published On : September 23, 2020 / 11:06 AM IST
ఉద్యోగంపై కన్నేసిన కొడుకు, ప్రియుడి మోజులో కూతురు, పిల్లల కోసం తల్లి.. అంతా కలిసి చంపేశారు

అతడో సింగరేణి కార్మికుడు. భార్య, ఓ కొడుకు, కూతురు. కష్టపడి పిల్లల్ని పెద్ద చేశాడు. మంచి చదువులు చదివించాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఉన్నంతలో హ్యాపీగా సాగిపోయే జీవితం అతడిది. అలాంటి వ్యక్తి ఓ రోజు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిది హత్యగా తేల్చారు. అయితే ఆ హత్య చేసింది ఆ ముగ్గురేనని తెలుసుకుని పోలీసులే షాక్‌కు గురయ్యారు.

కొడుకు, కూతురితో కలిసి భర్తను భార్యే చంపేసింది:
సెప్టెంబర్‌ 4వ తేదీ.. రాత్రి సమయం.. ఇంట్లో ఉరితాడుకు వేలాడుతూ ఓ వ్యక్తి.. కుటుంబసభ్యుల అరుపులతో స్థానికులు పరుగెత్తుకెళ్లారు.. ఉరితాడుకు వేలాడుతున్న ఆ ఇంటి పెద్దను కిందికి దించారు. ఇంతలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందంటూ కుటుంబసభ్యులను ఆరా తీశారు. తమకేం తెలియదని వారు చెప్పడంతో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయినా..మృతికి సంబంధించి ఎలాంటి సమాచారం లభించ లేదు.



మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు…అనుమానాస్పద మృతిపై ముమ్ముర దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిది హత్యగా గుర్తించారు. ఆ హత్య చేసింది కుటుంబసభ్యులేనని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. కొడుకు, కూతురితో కలిసి భార్యే..ఆ ఘాతుకానికి పాల్పడిందని తెలుసుకుని అవాక్కయ్యారు. మానవత్వాన్ని మంటగలిపిన ఈ దారుణ ఘటన…మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది.

కుటుంబసభ్యులే హత్య చేశారని తెలుసుకుని షాక్‌:
బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో శంకర్‌ అనే వ్యక్తి…భార్య, ఓ కొడుకు, కూతురితో కలిసి జీవనం సాగించేవాడు. శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్‌కె–7 గనిలో టింబర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సీన్‌కట్‌ చేస్తే…శంకర్‌ చిన్నకూతురు స్వాతి, శ్రీరాంపూర్‌కు చెందిన మంద శివసాయి అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ పెళ్లికి శంకర్‌ తిరస్కరించాడు. దీంతో కూతురితో పాటు భార్య కూడా…శంకర్‌పై కోపం పెంచుకున్నారు.



మరోవైపు జులాయిగా తిరిగే కొడుకుకు…తండ్రి ఉద్యోగంపై కన్ను పడింది. దీంతో ఇతడికి కూడా తండ్రి అంటే కోపమే. ఈ ముగ్గురు కలిసి శంకర్‌తో నిత్యం గొడవలు పెట్టుకునేవారు. అంతేకాదు…భర్తను అడ్డు తొలగించుకుంటే కూతురి వివాహంతో పాటు కుమారుడికి కారుణ్య నియమకంలో ఉద్యోగం వస్తుందని భావించిన భార్య విజయ మర్డర్‌కు పథకం వేసింది.

అయితే…కుటుంబ కలహాలతో మూడు నెలలుగా భార్యాపిల్లలకు దూరంగా మంచిర్యాలలో నివాసం ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు శంకర్‌. మర్డర్‌ ప్లాన్‌ వేసిన భార్యాపిల్లలు.. అందుకు ఓ వ్యూహం వేశారు. శివసాయి సాయం కూడా కోరారు. ప్లాన్‌లో భాగంగా…కూతురు స్వాతికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు, కొడుకు శ్రావణ్‌కు లక్షణాలున్నాయని ఫోన్‌లో భర్తకు సమచారం ఇచ్చింది విజయ. దీంతో కంగారుపడ్డ శంకర్‌…వెంటనే సెప్టెంబర్ 4న ఇంటికి చేరుకున్నాడు.



కరోనా పేరుతో ఇంటికి పిలిపించి హత్య:
అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో విజయ, శ్రావణ్‌, శివసాయి, స్వాతి..ఆయన గొంతుకు బెల్టు బిగించి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మెడకు చీరను చుట్టి ఉరివేసుకున్నట్లు ప్రచారం చేశారు. మృతుడి సోదరి రుక్మిణి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు..హత్యగా నిర్ధారించారు. తప్పించుకుని తిరుగుతున్న మృతుడి భార్యాపిల్లలను బెల్లంపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న శ్రీరాంపూర్‌కు చెందిన శివసాయి కోసం గాలింపు చేపట్టారు.

కనికరం లేని బిడ్డలు..రక్త సంబంధాన్ని తెంచుకునే కర్కశత్వం..మూడుముళ్లు వేసిన వ్యక్తికే ఉరితాడు బిగించింది భాగస్వామి. కష్టాల్లో తోడుంటానని, కడవరకు నీవెంటేనని చేసిన బాసలు ధిక్కరించింది. కన్నప్రేమ కంటే ప్రియుడే కావాలని..పెళ్లికి నిరాకరించిన నాన్న ప్రాణం తీస్తేనే జీవితం సాగుతుందనుకుంది ఆ కూతురు. కష్టపడేతత్వం లేక.. సులువుగా వచ్చే కారుణ్య ఉద్యోగం కోసం కడతేర్చాడో కొడుకు. కుటుంబానికి దూరంగా జీవనం..పిల్లలకు అనారోగ్యమని తెలిసి తట్టుకోలేక ఇంటికొచ్చిన తండ్రిని మానవ సంబంధాలను మరిచి ప్రాణాలు తీశారు ఆ కుటుంబ సభ్యులు.



ఉద్యోగం కోసం కొడుకు ఓ వైపు…,ప్రియుడి మోజులో పడిన కూతురు మరో వైపు…,మూడు ముళ్లు వేసిన వ్యక్తినే కడతేర్చాలనే భార్య ఇంకో వైపు…ఇలా ఈ ముగ్గురు కలిసి పన్నిన ఉచ్చులో చిక్కుకుని అసువులు బాసాడా వ్యక్తి. రక్త సంబంధాలను మరిచి వారి సుఖాల కోసం ప్రాణం తీసిన వారిని కఠినంగా శిక్షించాలని..మృతుడి బంధువులే కాదు..ఈ విషాద ఘటన తెలిసిన ప్రతి ఒక్కరు పోలీసులను కోరుతున్నారు.