Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ ఈఓ గీతారెడ్డి వివాదాస్పద నిర్ణయాలు

ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ గీతారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు యాదగిరిగుట్ట నర్సన్నకు చెడ్డపేరు తీసుకొస్తోంది. తాజాగా కొండపై పార్కింగ్ ఫీజుల దోపిడీకి తెరతీశారు ఈవో గీతారెడ్డి.

Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయ ఈఓ గీతారెడ్డి వివాదాస్పద నిర్ణయాలు

Yadadri Eo Geeta Reddy

Yadagirigutta Temple : యాదగిరిగుట్ట నారసింహుడు పేదల దేవుడి నుంచి పెద్దల దేవుడయ్యారా..? యాదాద్రి శ్రీవారు కాస్లీ దేవుడిగా మారుతున్నారా..? యాదగిరికొండ మీదకు వెళ్లాలంటే ఇక నుంచి సామాన్యుల జేబుకు చిల్లు పడాల్సిందేనా..? యాదాద్రి కొండపై చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే అదే అనిపిస్తోంది. దాదాపు నాలుగేళ్లు అత్యద్భుతంగా రూపుదిద్దుకొని ఆలయం ఇటీవలె ప్రారంభం కాగా.. అక్కడి వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. అవేవో.. ప్రభుత్వం తీసుకున్నవి కాదు.. ప్రజాప్రతినిధులు తీసుకున్ననిర్ణయాలు అంతకన్నా కావు.. కేవలం ఈవో.. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ గీతారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు యాదగిరిగుట్ట నర్సన్నకు చెడ్డపేరు తీసుకొస్తోంది. తాజాగా కొండపై పార్కింగ్ ఫీజుల దోపిడీకి తెరతీశారు ఈవో గీతారెడ్డి.

భక్తులు తమ కారులో కొండపైకి వెళ్లాలంటే.. వందల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. కొండపైన కారు పార్కింగ్‌ చేయాలంటే.. గంటకు 500 చెల్లించాలని ఆర్డర్స్ పాస్‌ చేశారు ఈవో గీతారెడ్డి. కారు పార్క్‌ చేసి గంట దాటితే.. ప్రతి గంటకు వంద రూపాయలు వసూలు చేయాలని ఆదేశించారు. అలా ఎన్ని గంటలు అక్కడ పార్క్ చేస్తే.. అన్ని వందలు సమర్పించుకోవాల్సిందే. దీంతో పాటు.. ఆలయం ప్రారంభమైన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను లెక్కచేయడం లేదట ఈవో గీతారెడ్డి. ఆఖరికి లోకల్‌ ఎమ్మెల్యేను కూడా లైట్‌ తీసుకుంటోందట. ఆటోలను కొండపైకి ఎక్కడనీయడం లేదు.. స్థానిక మీడియాను అడుగుపెట్టనీయడం లేదు.. అబ్బో ఒకటేమిటి… చెప్పుకుంటూ పోతే.. ఈవో గారి వివాదాస్పద నిర్ణయాలు లిస్టు పెద్దదే అవుతుంది.

Yadagiri Gutta : అమలులోకి యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్ ఫీజులు

సామాన్య భక్తులను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు కొండపైన. ఆలయ పునఃనిర్మాణం తర్వాత భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సెలవు రోజులు, వీకెండ్స్‌లో భక్తులతో కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునే వారితో పాటు వీకెండ్స్‌లో వేలాది మంది విద్యార్థులు దర్శనానికి వస్తున్నా.. వారికి సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. క్యూ లైన్లలో కనీస సౌకర్యాలు లేవని, దాహమేస్తే తాగేందుకు నీరు కూడా లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో క్యూలైన్లలో ఉండే మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గతంలో స్థానికులకు ప్రతి శనివారం ఉచిత దర్శనానికి అవకాశం కల్పించగా.. ఈవో దాన్ని నిలిపేశారు. దీంతో స్థానికులు ఆందోళన చేయడంతో ప్రతి శనివారం కేవలం రెండు గంటల పాటు అవకాశం కల్పిస్తామని రెండు రోజుల క్రితమే ప్రకటించారు ఈఓ గీతారెడ్డి.

ఇక కొండపైకి తెలియవారు వస్తే.. తీవ్ర అవస్థలకు గురి కావాల్సిందే. ఆటోల బంద్‌తో బస్సుల్లో వచ్చే భక్తులకు ఎక్కడ ఏముందో చెప్పే వారే కరువయ్యారు. బస్సుల్లో వచ్చే వారికి కల్యాణకట్ట, టికెట్ కౌంటర్లు ఎక్కడకున్నాయో తెలియక తికమక పడుతున్నారు. సరైన డైరెక్షన్‌ బోర్డులు ఏకపోవడంతో ఈ సమస్య ఎదురవుతోంది. బస్సు డ్రైవర్లు చొరవ తీసుకొని చెప్తే తప్ప.. తెలిసే పరిస్థితి లేదు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులను సైతం లెక్కచేయడం లేదు ఈవో గీతారెడ్డి. పునర్నిర్మాణం తర్వాత స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్, పాలకవర్గాన్ని సైతం గుట్టపైకి వాహనంతో అనుమతించలేదట. ఈఓ గీతారెడ్డి ఆదేశాలతోనే అడ్డుకున్నట్లు అప్పట్లో పోలీసులు కూడా ప్రకటించారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో యూనియన్లు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళన చేస్తున్నా.. ఇప్పటివరకు వారి వైపు కన్నెత్తి చూసింది లేదు.. పిలిచి మాట్లాడింది లేదు. పరోక్షంగా వందల కుటుంబాల పొట్టకొడుతున్నారు ఈవో గీతారెడ్డి.

Yadagirigutta Parking Charges : గంటకు రూ.500.. యాదగిరిగుట్టపై పార్కింగ్‌ చార్జీల బాదుడు

కొండపై ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఆటోలను అనుమతించడం లేదన్నది ఈఓ వాదన. ఉచిత బస్సులు ఉన్న తర్వాత ఆటోల అవసరమేంటని ఈఓ వాదన. మరి ఇప్పుడు ఉచిత బస్సులు ఉండగా.. ప్రత్యేక ఫీజుతో వాహనాలను ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అంటే సంపన్నులకే మేలు చేస్తారా అంటూ ఈఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాన్య భక్తులు. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటనకు విరుద్ధంగా కొండపై దుకాణాల ఏర్పాటుకు ఈవో గీతారెడ్డి అనుమతించారు. కేవలం కొంతమందికే.. దుకాణాలను ఇవ్వడంతో.. మిగతా వారు ఆందోళన చేస్తున్నారు. సీఎం చెప్పినా వినకుండా ఎలా అనుమతిస్తారని మిగతా దుకాణదారులు ప్రశ్నిస్తున్నారు. అందుకు జీవో ఉందని చెప్తున్న ఈఓ.. అధికారికంగా వివరణ ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు.