Azolla Cultivation : పాడిపశువవులు, కోళ్లు, జీవాలకు మేతగా అజొల్లా.. అజొల్లా సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు

అజొల్లా అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఫెర్న్ జాతి మొక్క. నీటిలో తేలియాడుతూ పెరుగుతుంది. శాశ్వత సిమెంటు తొట్లలోగాని, టార్పాలిన్ పరిచిన గుంటలలోగాని సులభంగా పెంచుకోవచ్చు. రెండు కిలోల అజొల్లా 1 కిలో దాణాతో సమానమంటే అతిశయోక్తి కాదు.

Azolla Cultivation : పాడిపశువవులు, కోళ్లు, జీవాలకు మేతగా అజొల్లా.. అజొల్లా సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు

Azolla Cultivation

Azolla Cultivation : వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, జీవాల పెంపకం, కోళ్లు తదితర రంగాల్లో దాదాపు 60 శాతం ఖర్చు మేతకే అవుతుంది. పచ్చిమేత కొరత, పెరిగిన దాణా ధరల వల్ల రైతు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాడు. ఈ నేపధ్యంలో పశుపోషకలు వరంగా వెలుగులోకి వచ్చింది అజొల్లా. ఇంటి వద్దే చిన్నచిన్న తొట్లలో పశువులు, జీవాల అవసరాలకు అనుగుణంగా అజొల్లాను సులభంగా పెంచుకోవచ్చు. నిత్యం దిగుబడి తీసుకోవచ్చు. పైగా దీన్ని పోషకాల గనిగా చెబుతారు. దీన్ని పశువుల మేపులో భాగం చేసుకుంటే రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చు.

READ ALSO : Azolla Cultivation : పశువుల దాణాగా…అజోల్లా సాగు

రైతుకు అనునిత్యం అండగా వుండే వ్యవసాయానుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ, జీవాలు, కోళ్ల పరిశ్రమలు ముఖ్యమైనవి. దాణా ధరలు నానాటికీ పెరిగిపోవటం, పచ్చిమేత కొరత తీవ్రమవటంతో పశుపోషణ రైతుకు కత్తిమీద సాములా మారింది. పశువుల మేపు ఖర్చును తగ్గించేందుకు అద్భుతమైన పోషక విలువలు కలిగిన అజొల్లా పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా… రైతులకు సరైన అవగాహన లేకపోవటం, విత్తనం దొరకక పోవటం వల్ల దీని సాగు విస్తరణ నత్తనడకన సాగుతోంది.

అజొల్లా అద్భుతమైన పోషక విలువలు కలిగిన ఫెర్న్ జాతి మొక్క. నీటిలో తేలియాడుతూ పెరుగుతుంది. శాశ్వత సిమెంటు తొట్లలోగాని, టార్పాలిన్ పరిచిన గుంటలలోగాని సులభంగా పెంచుకోవచ్చు. రెండు కిలోల అజొల్లా 1 కిలో దాణాతో సమానమంటే అతిశయోక్తి కాదు. దీనిలో 25-35శాతం మాంసకృత్తులు, అమినో యాసిడ్లు 7-10 శాతం, విటమిన్ బి-12, కాల్షియం 67 మిల్లీగ్రాములు, ఇనుము 7.3 మిల్లీగ్రాములతోపాటు అనేక సూక్ష్మ పోషకాలు నిక్షిప్తమైన వున్నాయి. కిలో అజొల్లా వుత్పత్తి ఖర్చు కేవలం 1 రూపాయి మాత్రమే. తొట్టినుండి ప్రతి రోజూ దిగుబడి రావటం వల్ల దీన్ని అక్షయపాత్రగా చెబుతారు.

READ ALSO : Quail Bird Farming : కౌజు పిట్టలకు మార్కెట్ లో మంచి డిమాండ్.. నిరుద్యోగులకు ఉపాధినిస్తున్న పెంపకం

అజొల్లా తొట్టి అడుగుభాగంలో 30 కిలోల మట్టి వేసి, నీటిని నింపి మొక్కలకు పోషకాలను అందించేందుకు పేడ మిశ్రమాన్ని వేయాల్సి వుంటుంది. రైతుస్థాయిలో సులభంగా పెంచుకోవటానికి వీలుగా అజొల్లా పిన్నేట రకం అనువైందిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని విత్తనాన్ని కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలోని ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అందిస్తున్నారు. అజొల్లాను ప్రతి రైతు సులభంగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఒక కిలో అజొల్లా చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10కిలోలు వస్తుంది. 7వరోజునుంచి ప్రతిరోజ విడిచి రోజు 2 నుండి 3 కిలోల అజొల్లాను సేకరించవచ్చు. దీన్ని పేడ వాసన పోయే వరకు శుభ్రంగా కడిగి దాణాతో కలిపి అందిస్తే పశువులు ఇష్టంగా తింటాయి. మొదట్లో కొద్దికొద్దిగా పశువులకు అలవాటుచేసి, ఆతర్వాత 1:1 నిష్పత్తిలో దాణాలో కలిపి వాడుకుంటే రైతుకు ఖర్చు తగ్గటమే కాకుండా 20శాతం అధిక పాల దిగుబడి పొందే అవకాశం వుంది.

READ ALSO : Cattle Reproduction : పశువుల పునరుత్పత్తిలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

అలాగే కోళ్లు, జీవాలకు మేపుకోవచ్చు. ప్రతి 10రోజులకొకసారి బెడ్ లో పావు వంతు నీటిని తీసివేసి కొత్తనీటితో నింపాలి. తొట్టిలో 7-10సెంటీమీటర్లు ఎత్తులో నీరు ఖచ్చితంగా వుండేటట్లు చూసుకోవాలి. నీరు ఎక్కువైతే వేర్లు పైపైనే వుండి మొక్క సరిగా పెరగదు. పోషకాల లభ్యత తక్కువగా వుంటుంది. తక్కువైతే వేర్లు నేలను తాకి తెగుళ్లు బారిన పడే అవకాశం వుంటుంది. 60రోజులకొకసారి తొట్లో 5కిలోల మట్టి తొలిగించి తిరిగి కొత్తమట్టితో నింపాలి. దీనితో పాటు 7రోజులకోసారి 1కిలో పేడ, 30గ్రాముల మినరల్ మిక్స్చర్ ను 5లీటర్ల నీటిలో కలిపి తొట్టిలో పోస్తే అజొల్లాకు పోషకాలు బాగా అంది అధిక దిగుబడి వస్తుందని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. జి. ప్రభాకర్.

పశు సంవర్థక శాఖ వారిని సంప్రదించి అజొల్లా తొట్టి నిర్మాణానికి అవసరమైన టార్పాలిన్ ను రాయితీపై పొందవచ్చు. అజొల్లా విత్తనం కోసం సంప్రదించాల్సిన చిరునామా… ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, కరీంనగర్, సెల్ నెం : 98485 73710, 94903 12348 .