Chilli Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన మిరప కోతలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Chilli Cultivation : మిరపను జూన్ నుంచి అక్టోబరు వరకు ఖరీఫ్ రబీ కాలాల్లో విత్తారు. వర్షాధారపు పంటగా ఖరీఫ్ లో ఎక్కువగా సాగుచేస్తారు. రబీలో నీటిపారుదల కింద సాగుచేయటం పరిపాటి.

Chilli Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన మిరప కోతలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

chilli cultivation and farming techniques

Updated On : November 27, 2024 / 2:29 PM IST

Chilli Cultivation : ఎగుమతి ప్రాధాన్యత వున్న వాణిజ్య పంటగా పేరుగాంచిన మిరపలో ప్రస్థుతం కాయకోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిరప సాగులో అత్యంత కీలకమైన దశ ఇది. కాయకోత,  కోత అనంతరం మిరప ఆరబెట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల, మిరప  నాణ్యతపై దీని ప్రభావం అధికంగా వుండి రైతులు ఆశించిన ధర పొందలేకపోతున్నారు.కాయ ఆరబెట్టేటప్పుడు చిన్నచిన్న పొరపాట్ల వల్ల తాలుకాయలు ఎక్కువగా వచ్చి దాదాపు 15నుంచి 20శాతం దిగుబడిని రైతులు నష్టపోతున్నారు. ఈ నేపధ్యంలో నాణ్యమైన దిగుబడి పొందేందుకు, కాయకోత సమయంలో, ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మిరపను జూన్ నుంచి అక్టోబరు వరకు ఖరీఫ్ రబీ కాలాల్లో విత్తారు. వర్షాధారపు పంటగా ఖరీఫ్ లో ఎక్కువగా సాగుచేస్తారు. రబీలో నీటిపారుదల కింద సాగుచేయటం పరిపాటి. ప్రస్తుతం ముందుగా విత్తిన పైర్లలో కాయలు పక్వదశకు చేరుకోవటంతో రైతులు కాయకోతలు జరుపుతున్నారు. సాధారణంగా మిరపతోటల్లో కాయకోతలు దఫదఫాలుగా చేయాల్సి వుంటుంది. మొక్కల్లో, పై కొమ్మలు పూతమీద వుండగానే కింది కొమ్మల్లో కాయ పక్వ దశకు చేరుకుంటాయి. తయారైన కాయలను దఫదఫాలుగా కోసివేస్తే దిగుబడి పెరిగే అవకాశం వుంటుంది.

కానీ, రైతులు మొత్తం పంటను రెండు మూడు సార్లుగా మాత్రమే కాయ కోతలు జరపటం వల్ల నాణ్యమైన పంట ఉత్పత్తి సాధించలేకపోతున్నారు. మిరపలో కాయకోత దశను, దిగుబడిని ప్రభావితంచేసే  కీలకమైన విషయంగా రైతులు గుర్తించాలి. ముందుగా కిందివైపు వున్న కొమ్మల్లో కాయలు పక్వ దశకు వస్తాయి. క్రమేపి పైన కొమ్మలు కాయలు పక్వ దశకు చేరుకుంటాయి.

అందువల్ల వర్షాధారపు మిరపలో 3 నుంచి 4 దఫాలుగా కాయకోతలు జరపాలి. నీటివసతి కింద సాగుచేస్తే 6 నుంచి 8 సార్లుగా కాయ కోతలు జరపాలి. వీటిని  కుప్పగా పోసిన  గ్రేడింగ్  చేయాలి. తెగులు సోకిన కాయలను, బూజువచ్చిన కాయలను గ్రేడింగ్ ద్వారా వేరుచేసి విడిగా ఆరబెట్టాలి. లేకపోతే మిగతా కాయలకు కూడా బూజు తెగులు వ్యాపించి తాలుకాయలుగా మారే ప్రమాధం వుంది. కోసిన కాయలను పాలిథిన్ పరదాలు లేదా సిమెంటు కళ్లాలపై ఆరబెట్టాలి. రాత్రి పూట మంచు పడకుండా పరదాలు కప్పి వుంచాలి.

మిరప కాయల్లో 10 నుంచి 11శాతం తేమ వుండేటట్లు ఆరబెట్టుకుంటే నాణ్యత బాగుండి మంచి మార్కెట్ ధర పొందే అవకాశం వుంటుంది. కాయలు ఎక్కువగా ఎండిబెట్టినప్పుడు రంగుశాతం కోల్పోవటం, పెళుసుగా మారి విరిగిపోవటం జరుగుతుంది. అలాగే తేమ ఎక్కువగా వుంటే కాయల్లో శిలీంధ్రాలు చేరి హానికారక విషపధార్ధాలు వృద్ధి చెంది నాణ్యత చెడిపోయే అవకాశం వుంది.అందువల్ల నిర్ధేశించిన తేమశాతం కాయల్లో వుండేటట్లు జాగ్రత్త వహించాలి.

ప్రస్థుతం మిరపకాయలను ఆరబెట్టేందుకు పాలీ డ్రయ్యర్ లు రైతులకు అందుబాటులో వున్నాయి. వీటిని ఏర్పాటు చేసుకునేందుకు ఉద్యానశాఖ 50శాతం సబ్సిడీ అందిస్తుంది. మిరపను దఫదఫాలుగా కోతలు జరుపుతాం కనుక వచ్చే ఉత్పత్తినిబట్టి రైతులు వీటిని తగిన సైజులో ఏర్పాటుచేసుకోవచ్చు. పాలీహౌస్ లో రెండు మూడు వరుసల్లో రేక్ లు ఏర్పాటుచేసుకుని, రెండు అంచెలుగా కాయలను ఆరబెట్టుకోవచ్చు. నిర్ధేశించిన రీతిలో ఉష్ణోగ్రత వుంటుంది కనుక కాయలు త్వరగా ఆరిపోతాయి.

పాలీడ్రయ్యర్ లో ఉష్ణోగ్రతనుబట్టి బయట విండోలకు ఏర్పాటుచేసిన పరదాలను తెరవటం, మూయటం జరుగుతుంది. ఈ విధానంలో కాయలపై ఎటువంటి దుమ్ము, ధూళీ పడకుండా నాణ్యమైన ఉత్పత్తి చేతికందుతుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ప్రభావం, వర్షాలు, మంచుబెడద వుండదు. ఇదేవిధంగా సోలార్ డ్రయ్యర్ లు కూడా రైతులకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఎటువంటి దుమ్ముధూళీ లేకుండా కాయలను ఎండబెట్టి, నాణ్యమైన మిరపకాయలను త్వరగా మార్కెట్ చేసుకునే అవకాశం వుంటుంది.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..