Dairy Farming In Summer : వేసవిలో పాడిపశువుల సంరక్షణ.. అధిక పాల దిగుబడి కోసం చేపట్టాల్సిన మెళకువలు 

Dairy Farming In Summer : ఈ ప్రభావం పాడిపరిశ్రమపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు, ముర్రాజాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి.

Dairy Farming In Summer : వేసవిలో పాడిపశువుల సంరక్షణ.. అధిక పాల దిగుబడి కోసం చేపట్టాల్సిన మెళకువలు 

Dairy Farming For Cattle care

Updated On : March 20, 2024 / 3:49 PM IST

Dairy Farming In Summer : వేసవికాలం మానవాళికే కాదు పశువులకు కూడా  గడ్డుకాలం. ముఖ్యంగా నమ్మకమైన ఆదాయవనరుగా వున్న పాడిపరిశ్రమలో నీటి ఎద్దడి, పశుగ్రాస కొరత లేకుండా  జాగ్రత్త పడాలి. వేసవి వడగాలుల నుంచి పశువులకు రక్షణ కల్పిస్తూ… పచ్చిమేత తగినంత లభ్యమయ్యేలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీని ప్రభావం పాల దిగుబడులపై పడే ప్రమాధం వుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే పాడి పశువుల నిర్వహణ అంత కష్టమేమి కాదంటున్నారు పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డా. హరికృష్ణ . మరి ఆ  వివరాలు ఇప్పుడు చూద్దాం.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

సాధారణంగా ప్రతి వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటాయి. ఈ ప్రభావం పాడిపరిశ్రమపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు, ముర్రాజాతి గేదెలు చాలా సున్నితమైన శరీర వ్యవస్థను కలిగి ఉంటాయి. వేసవిలో తీవ్రమైన ఎండలు వల్ల , శరీరంలోని నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోవటం వల్ల  తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి.  అధిక తాపం వల్ల  పాల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. పశువులు ఎక్కువగా ఎదకు వచ్చే సమయం ఇది. ఏమాత్రం ఉష్ణ తాపానికి గురైనా చూలు నిలవదు.  వడగాడ్పులవల్ల ప్రాణాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

వేసవిలో పాడిపశువుల సంరక్షణ :
ముఖ్యంగా చెమట ద్వారా శరీరంలోని అధిక వేడిని విసర్జించే అవకాశాలు పాడి పశువులకు చాలా తక్కువ. నల్లని చర్మం ద్వారా వాతావరణంలోని వేడి శరీరంలోకి ఎక్కువగా ప్రవేశించి తాపాన్ని పెంచుతుంది. పాల ఉత్పత్తిని ప్రభావితం చేసే హార్మోను వ్యవస్థ అధిక తాపానికి సులువుగా లోనై, పాల ఉత్పత్తి ప్రత్యుత్పత్తి మీద తీవ్రమైన ప్రతికూలతను చూపుతుంది. వడగాల్పుల రోజుల్లో గర్భస్రావాలు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి వేసవిలో పాడి పశువుల్ని, దూడల్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వదలకూడదు. పాకల చుటూ మామిడి, జామ, సపోట, అవిశె, మునగ, గానుగ, సుబాబుల్ వంటి బహుళ ప్రయోజనకర మొక్కలను నీడకోసం పెంచాలి.

షెడ్ల పైకప్పులకు  తెల్లని రంగు వేసి, ఆపైన గడ్డి , తాటి, కొబ్బరి వంటి ఆకుల్ని పరచడం వంటి చర్యల ద్వారా ఎండ వేడి షెడ్లలోపలికి ఎక్కువగా ప్రవేశించకుండా చూడవచ్చు. మద్యాహ్న సమయాల్లో పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి వాటిని తడపడం మంచిది. అత్యధిక పాలనిచ్చే సంకరజాతి ఆవులకు, ముర్రాగేదెలకు, ఫ్యాన్లను ఏర్పాటు చేయడం కూడా అవసరమే.

ముఖ్యంగా షెడ్లలోకి సమృద్ధిగా గాలి ప్రసరించే విధంగా, పాకల చుటూ తగినంత ఖాళీ స్థలంతో పాటు, పాకల ఎత్తులో ఉండే విధంగా నిర్మించుకోవాలి. పాడి గేదెల్ని మధ్యాహ్న సమయాల్లో వీలును బట్టి చెరువులు, కాల్వలు, నదులు, మడుగులలోకి వదలాలి. అవకాశం లేనివారు రోజుకు 2-3 సార్లు నీటిని చల్లడం, తడి గోతాలు పరవడం వంటి చర్యల ద్వారా ఉపశమనం కలిగించ వచ్చంటున్నారు రాజేంద్రనగర్ లోని నరసింహారావు  వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డా. హరికృష్ణ .

వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపు అవుతాయి. చల్లని శుభ్రమైన నీటిని పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. నీటి తొట్లను నీడలో ఉంచడం, మధ్యాహ్న సమయాలలోనైనా, తాజాగా బావి నుండి తోడిన చల్లని నీటిని, లేదా ఐసు కలిపిన నీటిని గానీ అందిస్తే మంచది. కనీసం రెండు రోజులకు సరిపడా తాగునీటిని నిల్వ చేసుకుంటే విద్యుత్ కోతల వల్ల సమస్య ఉండదు.

Read Also : Green Gram Cultivation : వేసవికి అనువైన పెసర రకాలు సాగు యాజమాన్యం