Paddy Cultivation : నారు, నాట్లు వేయనక్కర్లేదు.. ‘డ్రమ్ సీడర్’తో తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు!
Paddy Cultivation : సాధారణ పద్ధతిలాగేనే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు. డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు

Drum Seeder Techniques
Paddy Cultivation : డ్రమ్ సీడర్ తో వరిసాగు రైతుల ఆదరణ పొందుతోంది. కూలీల కొరత వరిసాగుకు పెద్ద సమస్యగా మారిన ప్రస్థుత తరుణంలో… ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడర్ తో విత్తనాన్ని ప్రధాన పొలంలో నేరుగా విత్తే ఈ విధానం రైతాంగానికి అన్ని విధాలా అనుకూలంగా వుంది.
అందుకే చాలా మంది ఈ ఏడాది డ్రమ్ సీడర్ తోనే వరిసాగుచేపడుతున్నారు. పెట్టుబడులు తగ్గడమే కాకుండా, సమయం కూడా కలిసివస్తుంది. అయితే డ్రమ్ సీడర్ తో వరి విత్తనం వేసేటప్పుడు.. సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
ఇటీవలి కాలంలో వరిసాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్దతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్దతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.
పంట కూడా 7 నుండి 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి రూ. 5 నుండి 6 వేల వరకు తగ్గుతుంది. మొక్కల సాంధ్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది.
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశం ఉంది.
అందువలన తెలుగు రాష్ట్రాలల్లో కొన్ని ప్రాంతాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే, డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. ఉమామహేశ్వర్.
Read Also : Mango Orchards : మామిడిలో గూడుపురుగల బెడద.. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలతో నివారించవచ్చు
డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసేటప్పుడు.. సాధారణ పద్దతిలో వరినాటేటప్పుడు కంటే భూమినంత బాగా చదును చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి. అంతే కాదు సాధారణ పద్ధతిలాగేనే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.