Integrated Farming : సమీకృత వ్యవసాయంలో.. వరి, చేపలు, ఉద్యాన పంటల సాగు
వరి కంటే 3 నుండి 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. అయితే ఈసాగు విధానం లోతట్టు భూములు, ముంపు ప్రాంతాల రైతులకు అత్యంత అనువుగా వుంది.

Integrated Farming and Cultivation Techniques in Telugu
Integrated Farming : చిన్న కమతాల రైతులు ఎక్కువయ్యారు. వరి సాగుపై ఆధారపడితే ఆదాయం సరిపోక, ఇతర పనులతో కుటుంబాన్ని వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వ్యవసాయ శాఖ, సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ విధానంలో వరితోపాటు చేపల పెంపకం చేపట్టవచ్చు. మెట్ట పంటలను గట్లపై సాగుచేయవచ్చు.
వరి కంటే 3 నుండి 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. అయితే ఈసాగు విధానం లోతట్టు భూములు, ముంపు ప్రాంతాల రైతులకు అత్యంత అనువుగా వుంది. ఎకరం భూమిలో సమీకృత వ్యవసాయం చేస్తే తన భూమిని మోడల్ ఫామ్ గా తీర్చిదిద్దారు, ఏలూరు జిల్లా రైతు . ఈ సాగు విధానంలోని ఎలాంటి లాభాలుంటాయో.. మనమూ తెలుసుకుందామా….
చిన్న, సన్నకారు రైతులు కేవలం వరిసాగుపై ఆధారపడితే కుటుంబం గడవని దుస్థితి నెలకొంది. ఎకరం రెండెకరాల భూమి వున్న రైతుకు ఏడాదికి 15 నుండి 40 వేల ఆదాయానికి మించటం లేదు. దీంతో పక్క భూములను కౌలుకు తీసుకోవటం లేదా ఇతర పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో ఎకరంలో వరితోపాటు, పొలం చుట్టూ కందకం తవ్వి చేపలను పెంచవచ్చు.
అలాగే గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు నాటి సంవత్సరం పొడవునా తమ కుటుంబ అవసరాలు తీర్చుకోవటంతోపాటు, అదనపు ఆదాయం పొందవచ్చు. కందకం తవ్వటానికి పెట్టుబడి అవసరం కనుక, ఈ సమీకృత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ 50 వేలు రాయితీ అందిస్తోంది.
ముంపు భూములు, లోతట్టు ప్రాంతాల రైతులకు ఈ సాగు విధానం అత్యంత అనుకూలంగా వుంది. ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, వెలమిల్లి గ్రామ రైతు రాజేంద్రప్రసాద్ ఎకరం భూమిలో ఈ సాగు విధానాన్ని అనుసరిస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతున్నారు.
దేశీ వరి రకమైన కుజుపటాలియాను పండిస్తున్న రాజేంద్రప్రసాద్. పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే ఈ సమీకృత వ్యవసాయంలో మాత్రం ఎటువంటి ఎరువులు, కషాయాలను వాడలేదు. ఇక్కడ చేపలు విసర్జించిన వ్యర్థాలే పంటలకు ఎరువు. దీనివల్ల తక్కువ అతి తక్కువ ఖర్చుతో పంట తీస్తున్నారు.
Read Also : Agri Info : ఏ గ్రేడ్ మోడల్లో వరిగట్లపై కూరగాయల సాగు