Tomato Cultivation : టమోటా సాగులో తెగుళ్లు , నివారణ పద్దతులు !

తెగులు సోకిన మొక్కల ఆకుల మీద అక్కడక్కడ పసుపు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకుని మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి.

Tomato Cultivation : టమోటా సాగులో తెగుళ్లు , నివారణ పద్దతులు !

Pests and prevention methods in tomato cultivation!

Tomato Cultivation : అన్ని కాలాల్లో సాగుకు అనువైన పంట టమోటా. నీటి వసతి తక్కువగా ఉన్నా, డ్రిప్ ద్వారా ఈ పంటను సాగు చేపట్టవచ్చు. శీతాకాలంలో ఈపంటకు అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతకు, ఎక్కువ వర్షపాతానికి ఇది తట్టుకోలేదు. చీడపీడలు , తెగుళ్ల విషయంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడితోపాటు, అదాయం పొందవచ్చు.

టమోటాను ఆశించే  తెగుళ్లు, నివారణ ;

నారుకుళ్లు తెగులు ; ఈ తెగులు ఆశిస్తే నారుమడిలో మొక్కల మొదళ్లు కుళ్లిపోయి నారు గుంపులు, గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పనిసరిగా 3గ్రా మాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. తరువాత ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని 4గ్రా 1 కేజీ విత్తనానికి కలిపి నారు పోయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రా లీటరు నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారి చేయాలి.

ఆకు మాడు తెగులు ; ఆకుల మీద , కాండం మీద కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులు మాడి ఎండిపోతాయి. మొక్క దశలో ఎప్పుడయినా ఆశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో ఖరీఫ్ సీజన్ లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3గ్రా కాస్టాన్ లేదా మాంకోజెబ్ లేదా క్లోరోధలోనిల్ 2గ్రా లేదా ప్రాపికోనజోల్ 1 మి.లీ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయాలి.

వడలు తెగులు ; మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకు మారి తోడిమతో సహా రాలి తరువాత మొక్క వడలిపోయి చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తెగులును తట్టుకునే బీటి1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదజని 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని ఎంచుకోవాలి.

వైరస్ తెగులు ; తెగులు సోకిన మొక్కల ఆకుల మీద అక్కడక్కడ పసుపు మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకుని మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే రసం పీల్చే పురుగుల నివారణకు అంతర్వాహిక కీటకనాశసులను పిచికారీ చేయాలి.

టమాటా స్పాటెడ్ విల్డ్ వైరస్ ; టమాట చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంకు మారి, ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి మాడిపోతాయి. మొక్కలు గిడసబారి పూత పిందె పుట్టక ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులను వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణకు డైమికోయేట్ లేదా మిథేల్ డెమటాన్ 2 మి.లీ లీటటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో మడికి 250 గ్రాములు నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ 3జి గుళికలు వాడి పంటను ఈ వైరస్ తెగులు నుండి కాపాడుకోవచ్చు.