Prawn Cultivation : ప్రస్తుతం రొయ్యల చెరువుల్లో.. చేపట్టాల్సిన మెళకువులు
Prawn Cultivation : సాధారణంగా వనామి సాగు చెరువులో నీటి ఉప్పదనం అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య వుండాలి. చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి.

Prawns cultivation
Prawn Cultivation : ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రొయ్యల సాగుకు గండంగా మారాయి. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు.. ఆ తరువాత అధిక ఇలా వాతావరణ ఒడిదుడుకుల కారణంగా అనేక సమస్యల తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రొయ్యల చెరువుల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు.. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్.
Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు
దినదినాభివృద్ధి చెందుతున్న ఆక్వారంగంలో, సమస్యలు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రొయ్యల కల్చర్ లో వివిధ బాక్టీరియా వైరస్ వ్యాధుల దాడి కల్చర్ ను అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణ ఒడిదుడుకులు, అధిక వర్షాల వల్ల రొయ్యల సాగులో సమస్యలు అధికంగా వుంటాయి. దీంతో చాలామంది రైతులు శీతాకాలం, వేసవి కాలాల్లో కల్చర్ కొనసాగుస్తున్నారు. అయినా తరచూ ఏర్పడే వాతావరణ ఒడిదుడుకుల వల్ల వ్యాధుల ఉధృతి తప్పటం లేదు. రైతులు అవగాహన లోపం కూడా వ్యాధుల తీవ్రత పెరిగేందుకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా వనామి సాగు చెరువులో నీటి ఉప్పదనం అంటే సెలైనిటీ 8 నుండి 25 మధ్య వుండాలి. చెరువులో రొయ్యలు అలవాటు పడిన నీటి సెలైనిటీలో హెచ్చుతగ్గులు లేకుండా జాగ్రత్త వహించాలి. అయితే వర్షాలు కురిసినప్పుడు, నీటి ఉప్పదనంలో సంభవించే మార్పులు వల్ల రొయ్యలు ఒత్తిడికి గురై వ్యాధులకు లోనవటం జరుగుతోంది. సాధారణంగా చెరువులో బాక్టీరియా వృద్ధి అనేది సహజంగానే వుంటుంది. అయితే ప్రతికూల పరిస్థితుల్లో చెరువు వాతావరణంలో మార్పులు వల్ల హానికారక బాక్టీరియా, వైరస్ వృద్ధి చెందటం, రొయ్యల ఒత్తిడికి గురై బలహీనపడినప్పుడు ఇవి దాడి చేయటం వల్ల రైతులు నష్టపోతున్నారు.
దీనికితోడు అవసరానికి మించి రొయ్యల మేత వినియోగం వల్ల, నీటిలో హానికారక వాయువులు అభివృద్ధి చెంది, వ్యాధుల దాడి పెరిగిపోతోంది. ప్రస్థుతం వాతావరణ పరిస్థితుల్లో రొయ్యల చెరువుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా , ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్.
రొయ్యల మేత వినియోగంలో రైతులు చెక్ ట్రేల ఆధారంగా రోజుకు ఎంత మేత వినియోగం అవుతుందనేది నిర్ధారించుకుని తదనుగుణంగా మేతను అందించాలి. దీనివల్ల మేత వృధా తగ్గి చెరువులో విషవాయువులు ప్రబలకుండా వుంటాయి. వర్షాలు, వాతావరణ మార్పులు సంభవించినప్పుడు శాస్త్రవేత్తలు నిర్థేశించిన చర్యలు చేపడితే రొయ్యలు ఒత్తిడికి లోనవకుండా, చెరువులో హానికారక బాక్టీరియ, వైరస్ వ్యాధుల ప్రభలకుండా నివారించవచ్చు.
Read Also : Sorghum Seeds : రబీకి అనువైన జొన్న రకాలు – మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు