Mosambi Farming : బత్తాయి రైతుని వేధిస్తున్న ‘వడప’ తెగులు- నివారణకు శాస్త్రవేత్తల సలహాలు 

Mosambi Farming : బత్తాయి సాగుచేసే అన్ని ప్రాంతాల్లోను ఏటా ఈ తెగులు వ్యాప్తి సర్వసాధారణంగా మారిపోయింది.

Mosambi Farming : బత్తాయి రైతుని వేధిస్తున్న ‘వడప’ తెగులు- నివారణకు శాస్త్రవేత్తల సలహాలు 

Mosambi Farming

Updated On : January 13, 2025 / 10:41 AM IST

Mosambi Farming : బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో రైతును వేధిస్తున్న సమస్య “వడప”. కాయ పక్వానికి రాకముందే తొడిమనుంచి ఊడిపోయి రాలిపోవటం దీని ప్రధాన లక్షణం. బొడ్డుకుళ్లు లేదా తొడిమకుళ్లుగా వ్యవహరించే ఈ తెగులు వల్ల బత్తాయి దిగుబడికి వాటిల్లే నష్టం అపారంగా వుంది. బత్తాయి సాగుచేసే అన్ని ప్రాంతాల్లోను ఏటా ఈ తెగులు వ్యాప్తి సర్వసాధారణంగా మారిపోయింది. శిలీంధ్రం ద్వారా వ్యాప్తిచెందే ఈ తెగులు  లక్షణాలు… నివారణ చర్యలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

చెట్టు కింద విపరీతంగా రాలిపోయిన ఈ కాయలను చూశారా…కాయ చిన్న సైజులో వున్నప్పడే ఇంత విపరీతానికి దారి తీసిన కారణమేంటే అన్నదేగా మీ ఆలోచన…దీన్నే “వడప” లేదా తొడిమకుళ్లు అంటారు. రాలిన కాయలను పరిశీలనగా చూస్తే కాయలకు తొడిమ వుండదు. ఇది వడప ప్రధాన లక్షణం. శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఈ తెగులు ప్రభావం ప్రధానంగా… కొమ్మ చివరి భాగాల్లో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై వుంటుంది.

బలహీనంగా వున్న చెట్లలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో తోటలో అక్కడక్కడా, కొన్ని చెట్లలో మాత్రమే ఈ తెగులు ప్రభావం కనిపించేది. కానీ ఇప్పుడు అన్ని చెట్లలో కనిపిస్తూ…రైతును తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని బత్తాయి తోటల్లో రైతులకు ఈ తెగులు బెడద, పెద్ద చర్చనియాంశంగా మారింది. వడప వస్తే పంటపై ఆశలు వదులుకోవాల్సిందే..

అదే విధంగా ప్రస్థుతం తోటల్లో దీని ప్రభావం కనిపిస్తోంది.  రసాయన ఎరువులు, కలుపు రసాయనాలు అధికంగా వాడిన తోటల్లోను, తీవ్ర నీటి ఎద్దడితో చెట్లు ఒత్తిడికి గురైనప్పుడు ఈ శిలీంధ్రం తాకిడి కాయల తొడిమలపై అధికంగా కనిపిస్తుంది.  గతంలో సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో ఈ తెగులు బెడద అధికంగా వుండేది. ప్రస్థుతం అన్ని సీజన్లలోను కనిపిస్తోంది.

వాతావరణంలో తేమ అధికంగా వున్నప్పుడు, వర్షాలు ఎక్కువగా వున్నప్పుడు ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు త్వరగా వ్యాపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 1గ్రాము లేదా 1 శాతం బోర్డో మిశ్రమం లేదా కార్బండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారిచేయాలి. బొడ్డుకుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి.

కాయలు రాలిపోయిన తర్వాత ఈ కొమ్మలు చూడండి.. నల్లగా మసిబారి చివరి నుంచి ఎండు ముఖం పడుతున్నాయి. దీనివల్ల తోటల్లో ఎండుపుల్ల అధికంగా వస్తుంది. ఈ శిలీంధ్ర నివారణకు మందులు పిచికారిచేయటం ఒక ఎత్తైతే తోటలో చేపట్టే యాజమాన్యం మరో ఎత్తు. ఈ తెగులు నివారణ చర్యల్లో భాగంగా తోటల్లో ప్రతి సంవత్సరం తొలకరిలో ఎండుపుల్లను కత్తిరించి నాశనం చేయాలి.

శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్ధవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంభించటం, చెట్ల మధ్య దున్నకాలు చేయటం అత్యుత్తమ విధానం. రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, చెట్లు ఒత్తిడికి గురికాకుండా సకాలంలో నీటితడులు అందించాలి. సాధ్యమైనంతవరకు తోటల్లో కలుపు మందులు వాడకుండా వుండటం ఉత్తమం.

Read Also : Sesame Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన నువ్వు సాగు విస్తీర్ణం.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం