Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం
ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. ఈ పంటసాగుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం.

Safflower
Safflower Cultivation : ఔషధ మొక్కగా, నూనెగింజ పంటగా విశిష్ఠ ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంటలో ఆదాయం తక్కువగా వుండటం, మొక్కకు ముళ్లు అధికంగా వుండటం, పంట కోతకు కూలీలు దొరకక పోవటం వల్ల క్రమేపి దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అయితే ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఏర్పడటంతో ఈ పంట భవిష్యత్ ఆశాజనకంగా కన్పిస్తోంది. దీనికితోడు ముళ్లులేని రకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రబీ పంటగా కుసుమ ప్రాధాన్యత, సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. జి.సుబ్బారావు.
READ ALSO : Pink Worm Prevention : పత్తికి గులాబి రంగు పురుగు బెడద.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
నూనెగింజ పంటల్లో బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న పంట కుసుమ. దీని శాస్త్రీయనామం కార్థమస్ టింక్టోరియస్. ఇది కొమ్మలు కలిగిన ఏకవార్షిక గుల్మం. దీని ఆకులు వాడిగా ఉన్న ముళ్లను కలిగి ఉంటాయి. మొక్కలు 30 నుండి 150 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. కుసుమను ఇంగ్లీషులో శాఫ్ ఫ్లవర్ అంటారు. పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం తట్టుకోలేదు. భారతదేశంలో ఈ పంట వీస్తీర్ణం సుమారు 3లక్షల 60వేల హెక్టార్లుగా వుంది. కర్నాటక మహారాష్ట్రల్లో సాగు విస్తీర్ణం అధికంగా వుంది.
READ ALSO : Boda Kakarakaya Cultivation : బోడకాకరసాగుతో బోలెడు లాభాలు
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో 12 వేల ఎకరాల్లోను, తెలంగాణ రాష్ట్రంలో 20వేల ఎకరాలకే దీని సాగు పరిమితమయ్యింది. ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. ఈ పంటసాగుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం. ఆలస్యమైనప్పుడు నవంబరు 15 వరకు విత్తుకునే అవకాశం వుంది. సాగుచేసిన రకాన్నిబట్టి కుసుమ పంటకాలం 120 నుంచి 135రోజుల వరకు వుంటుంది. గతంలో ఎకరాకు 3,4క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది.
READ ALSO : Rice Seed Production : వరి విత్తనోత్పత్తితో లాభాలు ఆర్జిస్తున్న రైతు
అధిక దిగుబడినిచ్చే రకాల్లో టి.ఎస్.ఎఫ్ – 1, నారీ – 6, నారీ ఎన్.హెచ్ – 1, పి.బి.ఎన్.ఎస్ -12, డి.యస్.హెచ్ – 185, ఎస్.ఎస్.ఎఫ్- 708 వంటి రకాలు వున్నాయి. వీటిలో నారీ-6 రకం ముళ్లు లేనిది. పంటకోత నూర్పిడి సులభంగా వుంటుంది. కుసుమ పువ్వుల నుండి సేకరీంచే పూరెక్కల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలలో అద్దకపు రంగుగా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు తేనీటిలో కూడా వినియోగిస్తున్నారు. అందువల్ల పూరెక్కలకు సేకరించి మార్కెట్ చేస్తే రైతుకు అదనపు రాబడి లభస్తుంది.
READ ALSO : Bitter Gourd Farming : నిలువు పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు లక్ష రూపాయల నికర ఆదాయం
కిలో పూరెక్కలకు 800 నుండి 1000 రూపాయల ధర లభిస్తోంది. ఎకరాకు 30 కిలోల వరకు పూరెక్కలను సేకరించి అదనపు రాబడిపొందే వీలుంది. ప్రస్థుతం రబీలో విత్తిన కుసుమ పంట చాలాప్రాంతాల్లో పూత దశ నుండి కోత దశకు చేరుకుంది. కుసుమ నూనె వాడకం పెరగటంతో వివిధ కంపెనీలు పొలాల వద్దే పంటను కొనుగోలుచేసేందుకు ఆసక్తిచూపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రబీ పంటగా కుసుమను విస్తరించేందుకు శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రెండుమూడు తడులు అందించే ప్రాంతాల్లో రైతులు కుసుమ సాగు ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేస్తున్నారు దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. జి.సుబ్బారావు.
READ ALSO : Chilli Cultivation : మిరపలో బాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఉధృతి
తక్కువ శ్రమ,ఖర్చుతో మంచి ఫలితాలనిచ్చే పంట కుసుమ. నీరు నిలవని బరువైన నేలలు, నీటివసతి గల ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఈ పంటలో ఆదాయం పెంచుకునేందుకు వేరుశనగ, అపరాల పంటలను అంతర పంటలుగా సాగుచేయవచ్చు. అయితే ఈ పంటకు ఆకుమచ్చ తెగుళ్లు, పెనుబంక పురుగు సమస్య ఎక్కువగా వుంటుంది. వీటిని సకాలంలో నివారించాలి. సాగుచేసిన రకాన్నిబట్టి 115 నుంచి 135రోజుల్లో పంట పక్వదశకు చేరుకుంటుంది. గత ఏడాది ప్రయోగాత్మకంగా సాగుచేసిన పంటలో కూడా మంచి ఫలితాలు వచ్చాయని, తక్కువ ఖర్చుతో రైతుకు రాబడి ఆశాజనకంగా వుంటుందని డా. సుబ్బారావు తెలిపారు.
READ ALSO : Vande Bharat Sleeper Coach : వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త…వచ్చే ఏడాది స్లీపర్ కోచ్‌లు
చూశారుగా కుసుమ సాగు ఎంత ఆశాజనకంగా వుందో… ప్రస్థుత పరిస్థితుల్లో ఒక రకంగా నిర్లక్ష్యానికి గురైన పంట ఇది. ఆదాయం తక్కువగా వున్నా.. పూతను సేకరించటం ద్వారా, అంతరపంటలు సాగుచేయటం ద్వారా నికరలాభం పెంచుకునే అవకాశాలు స్పష్టంగా వున్నాయి. వంట నూనె దిగుమతులు దేశానికి భారంగా మారిన ప్రస్థుత పరిస్థితుల్లో ఆరోగ్యానికి మేలుచేసే విశిష్ఠ విలువలు కలిగిన కుసుమ వంటి నూనెగింజ పంటల సాగుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తే రైతులు సాగువైపు ఉత్సాహంగా ముందడుగు వేసే అవకాశం వుంది.