Jaggery Making : బెల్లం తయారీలో మెళకువలు.. నాణ్యమైన బెల్లం దిగుబడులకు సూచనలు

బెల్లాన్ని వివిధ రూపాల్లో తయారుచేసి, విలువ ఆధారిత ఉత్పత్తిగా విక్రయించటం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వివరాలు చూద్దాం.

Jaggery Making : బెల్లం తయారీలో మెళకువలు.. నాణ్యమైన బెల్లం దిగుబడులకు సూచనలు

Matti Manishi, 10TV Agri, Jaggery Making

Jaggery Making : చిన్నకమతాల్లో చెరకు సాగుచేసే రైతులకు, బెల్లం తయారీ మంచి ఉపాధిని కల్పిస్తోంది. చెరకును ఫ్యాక్టరీలకు తోలిన దానికంటే, బెల్లం తయారీ వల్ల రైతులు అదనపు రాబడి పొందగలుగుతున్నారు.  అయితే తయారీలో చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల నాణ్యమైన ఉత్పత్తి సాధించలేకపోతున్నారు. ఒక్కోసారి మార్కెట్ రేట్ల హెచ్చుతగ్గులు లాభాలను మింగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నాణ్యమైన బెల్లం ఉత్పత్తి తయారీతోపాటు, బెల్లాన్ని వివిధ రూపాల్లో తయారుచేసి, విలువ ఆధారిత ఉత్పత్తిగా విక్రయించటం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వివరాలు చూద్దాం.

చెరకు పంటకాలం 12 నెలలు. ఏడాది పొడవునా ఈ ఒక్క పంటే రైతుకు ఆధారం. సగటున ఎకరాకు 35 నుచి 40 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. అయితే సాగు ఖర్చు, చెరికు నరికేందుకు కూలీల ఖర్చు భారీగా వుండటంతో  ఎకరాకు 15 నుంచి 30 వేలు మిగలటం కనాకష్టంగా వుంది. ఈ నేపధ్యంలో చిన్నసన్నకారు రైతులు బెల్లం తయారీకి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేల ఎకరాల్లో చెరకును రైతులు బెల్లం తయారీ కోసం పెంచుతున్నారు.

ఈ ప్రాంతంలో వర్షాధారంగా చెరకును పండిస్తారు. మే నెలలో చెరకును నాటి జనవరి నుంచి మార్చి, ఏప్రెల్ నెల వరకు చెరకును దఫదఫాలుగా నరికి బెల్లం తయారు చేస్తారు. ఫ్యాక్టరీకి చెరకును తోలితే సకాలంలో డబ్బు చేతికి అందకపోవటం, బెల్లం తయారీతో ఎకరాకు 5 నుంచి 10వేలు అదనపు ఆదాయం వస్తుండటంతో అధిక శాతం మంది రైతులు ఈ పరిశ్రమ వైపు ఆకర్షితులవుతున్నారు.

విలువ ఆధారిత ఉత్పత్తిగా బెల్లం తయారీ :
అనకాపల్లి బెల్లం మార్కెట్ అందుబాటులో వుండటంతో విశాఖ జిల్లాలో ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది.  సాధారణంగా శీతాకాలంలో చెరకు నుంచి బెల్లం రికవరీ ఎక్కువ వుంటుంది. టన్ను చెరకు నుంచి  రైతులు100 నుంచి 120కిలోల బెల్లం  దిగుబడి తీస్తున్నారు. టన్ను చెరకుకు ఫ్యాక్టరీలు చెల్లించే ధర సూమారు 3 వేల రూపాయిలు. అదే బెల్లం ఆడితే 3300 నుంచి 3500  వరకు ధర లభిస్తోంది. ఖర్చులు పోను టన్నుకు 100 నుంచి 200 రూపాయల ధర అదనంగా లభిస్తోంది.

ప్రస్థుతం చాలా ప్రాంతాల్లో చెరకు పక్వ దశకు చేరుకోవటంతో రైతులు బెల్లం తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. నాణ్యమైన బెల్లం తయారు చేయాలనుకునే రైతులు  చెరకును నరికిన దగ్గరనుంచి బెల్లం దింపే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  ముఖ్యంగా చెరకు పక్వత వచ్చిన తరువాతనే నేలమట్టానికి నరకాలి. చెరకు మొదల్లోనే సుక్రోజ్ శాతం  అధికంగా ఉంటుంది. రసం తీసేటప్పుడు నిలువు క్రషర్ ద్వారా కాకుండా అడ్డ క్రషర్ ద్వారా చెరకు రసాన్ని తీస్తే 2  నుంచి 5 శాతం దిగుబడి పెరుగుతుందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. శ్రీదేవి చెబుతున్నారు.

బెల్లంను వండేందుకు అనకాపల్లి పోయ్యిలను వాడితే మంచిది.  దీనిలో రసం త్వరగా మరగుతుంది.  తక్కువ వంటచెరకుతో  నాణ్యమయిన బెల్లం పొందవచ్చు. బెల్లం తయారీకి, ఇనుప పెనాలు కాకుండా  స్టెయిన్ లెస్ స్టీల్ పెనాలు వినియోగించితే నాణ్యమైన బెల్లంతో పాటు మంచి రంగు వస్తుందని శాస్త్రవేత్త చెబుతున్నారు..

అనకాపల్లి చెరకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వివిధ బెల్లం ఉప ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. బెల్లానికి విలువ జోడింపు చేసి  చాక్లేట్ లు, బిస్కేట్ లు,  బెల్లంపొడి, అల్లం కేడెట్ జాగరి, ఓట్స్, బేబీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. పొడిబెల్లం పై అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా స్థానం పేటెంట్ హక్కును కూడా సాధించింది.

ఈ టెక్నాలజీ కావాలంటే లక్షరూపాయలు చెల్లించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వీటి పట్ల ఆసక్తి ఉన్న రైతులు, పారిశ్రామిక వేత్తలు  రూ. 10 వేలు చెల్లిస్తే  తయారి విధానంలో  శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. సరైన మెళకువలను పాటిస్తే నాణ్యమైన బెల్లం తయారు చేయవచ్చు. మార్కెట్ కు అనుగుణంగా బెల్లం ఉప ఉత్పత్తులను తయారు చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

Read Also : Jeevamrutham Preparation : నేలకు బలం.. పంటకు ఆరోగ్యం.. జీవామృతం తయారీ విధానం