Kharif Crops : ఈ ఏడాదైనా కలిసి వచ్చేనా..? ఖరీఫ్ పంటలపై ఆశలు పెట్టుకున్న అన్నదాతలు
గతేడాదితో పోలిస్తే వానాకాలం సాగులో అదనంగా పంటల సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. అయితే ఒకే వర్షానికి విత్తనాలు వేయకుండా రైతులు సంయమనం పాటించాలి. నేలంతా తడిసిన తర్వాత వర్షాలకు అనుకూలంగా విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

Kharif Crops
Kharif Crops : అన్నదాతలు ఖరీఫ్ పంటలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ యేడైనా ఖరీఫ్ ఆదుకునేనా అని ఎదురుచూస్తున్నారు. గత ఖరీఫ్ రైతులను కన్నీళ్లు పెట్టించింది. ఈయాసంగి కూడా వారిని యాతనకు గురి చేసింది. అకాల వర్షాల వల్ల పంటలు పోయి కన్నీళ్లే మిగులుతున్నాయి. కష్టాల సేద్యం తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ ఖరీఫ్ పంటల ప్రణాళికలకు రూపొందించారు. గత ఖరీఫ్‌లో సాగైన పంటల విస్తీర్ణం, ఎదురైన ప్రతిబందకాలు, విస్తీర్ణంలో చోటుచేసుకున్న హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికను సిద్ధం చేసింది.
READ ALSO : Pest Control in Paddy : వానకాలం వరిసాగులో అధికంగా ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల తాకిడి
హనుమకొండ జిల్లాలో గత ఖరీఫ్ సీజన్‌లో 2 లక్షల40 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సారి ఖరీఫ్‌లో కూడా ఇంచుమించు అంతే విస్తీర్ణంలో పంటలు సాగు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కిందటి ఖరీఫ్‌లో మాదిరిగానే ఈ సారి కూడా లక్షా 47 వేల ఎకరాల్లో వరి, 84వేల ఎకరాల్లో పత్తి, 6 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వెయ్యి ఎకరాల్లో నూనె గింజలు, ఇతరత్రా పంటలు సాగు కాగలవని భావిస్తున్నారు.
వాస్తవానికి గత ఖరీఫ్ లో 2 లక్షల 60 వేల ఎకరాల్లో పంటలు సాగుకాగలవని భావించారు. సాగులోకి వచ్చే సరికి 20 వేల ఎకరాలు తగ్గింది. ఈ సారి ఖరీఫ్‌లో ఆ పరిస్థితి అంతగా ఉండక పోవచ్చని అనుకుంటున్నారు. గత ఖరీఫ్‌లో కన్నా ఈసారి సుమారు 10వేల ఎకరాల్లో అదనంగా పంటలు సాగు అవుతుందని భావిస్తున్నారు.
READ ALSO : Dairy Farming : గేదెల డెయిరీతో ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమగోదావరి జిల్లా రైతు
వరంగల్ జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటలకు సంబంధించి కోతలు పూర్తయ్యాయి. దీంతో వానాకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతుండగా.. అందుకనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏఏ పంటలు ఎన్ని ఎకరాల్లో వేసే అవకాశం ఉంది. ఎంత మొత్తంలో ఎరువులు అవసరమో ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
గతేడాదితో పోలిస్తే వానాకాలం సాగులో అదనంగా పంటల సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. అయితే ఒకే వర్షానికి విత్తనాలు వేయకుండా రైతులు సంయమనం పాటించాలి. నేలంతా తడిసిన తర్వాత వర్షాలకు అనుకూలంగా విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.
READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!
మహబూబాబాద్ లో గత ఖరీఫ్ లో 4 లక్షల51 వేల 812 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 4 లక్షల60 వేల 580 ఎకరాల్లో రైతులు పంటలను వేయనున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 8,768 ఎకరాల్లో అదనపు సాగు కానుంది. ప్రతి ఏటా వానకాలం, యాసంగి పంటల సాగుకు ముందే అధికారులు జిల్లావ్యాప్తంగా ఏ పంట ఎంత సాగవుతుందో ముందే అంచనా వేసి ప్రణాళికను ఖరారు చేస్తారు. అధికారులు అంచనా వేసిన వాటిలో కొన్ని పంటల సాగు ఎక్కువ, మరికొన్ని తక్కువ స్థాయిలో రైతులు సాగు చేస్తారు.
జనగామ జిల్లాలో ఖరీఫ్ కు సంబంధించిన పంటల అంచనా సాగు విస్తీర్ణం, అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో నేల స్వభావాన్ని బట్టి ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అయ్యే అవకాశం ఉందనే దాన్ని బట్టి మండలాల వారీగా ప్లానింగ్ తయారు చేశారు. జూన్ నెలతో వానాకాలం సీజన్ ప్రారంభం అయ్యింది. అన్ని రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 3లక్షల 65 వేల ఎకరాల్లో సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు.
కాగా.. ఈ సీజన్ నుంచి వానాకాలం, యాసంగి సీజన్‌లను ముందుకు జరపాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో వడగండ్ల వాన కురిసి పంటలకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో ముందస్తుగా నాట్లు వేయించి, ముందస్తుగా కోతలు కోయించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
భూపాల పల్లి జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంటల సాగు విస్తీర్ణం గతేడాది కంటే పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గత వానాకాలంలో 2లక్షల 32 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ప్రస్తుత వానాకాలంలో 2 లక్షల 75 వేల ఎకరాల్లో అన్నదాతలు పంటలు సాగు చేయనున్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.
READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు
అందులోంచి అత్యధికంగా వరి, పత్తి పంట వేసేందుకు అన్నదాతలు మొగ్గు చూపుతుండగా తర్వాత స్థానాల్లో మిర్చి, ఆయిల్ పామ్ పంటలు ఉన్నాయి. వానాకాలం పంటలకు సంబంధించి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే ఇప్పటి వరకు సరైన ప్రణాళిక రూపొందించడంలేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు పంటల సాగులో అవగాహన కల్పించడంలేదంటున్నారు. మరోవైపు యాసంగి పండించిన పంటలను నేటికి కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నయంటున్నారు.
READ ALSO : Organic Farmer : టీచింగ్ వదిలేసి.. ప్రకృతి వ్యవసాయం
ఈ ఏడాదైనా సాగు కలిసి వస్తేనే రైతులకు మేలు కలిగే అవకాశం ఉంది. కష్టాల నుంచి కాస్తయినా గట్టెక్కగలుతారు. గతేడాది ఖరీఫ్ రైతులకు ఏ మాత్రం కలిసి రాలేదు. పడ్డ శ్రమంతా వృథాగానే పోయింది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనున్న పత్తి.. ఆరు క్వింటాళ్లకే పరిమితమైంది.
కొంతమంది రైతులకైతే సగటున 5క్వింటాళ్ల దిగుబడి సైతం రాలేదు. ఆశించిన ధరలు లభించక రైతులు అన్ని విధాలుగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ యాసంగిలో సైతం రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. అకాల వర్షాల వల్ల వరి, మొక్కొజొన్న పంటలతో పాటు మామిడి చేతికిరాకుండా పోయింది. వచ్చే ఖరీఫ్ అయినా తమను ఆదుకుంటుందన్న ఆశతో ఉన్నారు.