CRDA Decisions: పరిశ్రమలకు 2500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2500 ఎకరాలు.. సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం
రెండో దశ భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే.. అక్కడక్కడా వైసీపీ వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు.

Minister Narayana
CRDA Decisions: ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీ అథారిటీ సమావేశం జరిగింది. దీనికి మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది సీఆర్డీఏ. రాజధాని పరిధిలో 7 అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటునకు 2500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటునకు మరో 2500 ఎకరాలు కేటాయించేందుకు సీఎం అంగీకారం తెలిపారు.
భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్ననిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. రెండో విడత భూ సమీకరణ కోసం 7 గ్రామాల పరిధిలో 20వేల 494 పై చిలుకు ఎకరాలకు ఆమోదం తెలిపామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే 10వేల ఎకరాలు అవసరం అన్నారు. భూ సేకరణ వల్ల రైతులు నష్టపోతారని పాత పద్దతిలో భూ సమీకరణకు వెళ్తున్నామన్నారు.
కన్వెన్షన్ సెంటర్స్ ఏర్పాటునకు సoబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 5 స్టార్ హోటల్స్ కట్టే సoస్థలు కన్వెన్షన్ సెంటర్స్ ఏర్పాటుకు ముందుకొచ్చాయని మంత్రి నారాయణ వెల్లడించారు. 10 వేల మంది కెపాసిటీతో కన్వెన్షన్ సెంటర్ కట్టే 5 స్టార్ హోటల్ కు అదనంగా 2.5 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఏడున్నర వేల మంది కెపాసిటీ కన్వెన్షన్ సెంటర్ కట్టే స్టార్ హోటల్ కు 2 ఎకరాలు ఇస్తామన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుక కృష్ణా నదిలో తవ్వుకునే విధంగా సీఆర్డీఏకు అనుమతులు మంజూరు చేశారు.
Also Read: శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య వివాదం.. అధిష్టానం సీరియస్..!
పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. రాజధాని పరిధిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం బీజేపీ చేసుకున్న దరఖాస్తు పరిశీలించి 2 ఎకరాలు కేటాయించారు. రెండో దశ భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుంటే.. అక్కడక్కడా వైసీపీ వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆరోపించారు. వచ్చే మూడేళ్లలో అనుకున్న విధంగా రాజధాని అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.