28వేల మంది విదేశీయులు, ఎన్నారైలను గుర్తించాం : పేర్ని నాని

కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి 28వేల మంది ఏపీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. సుమారు 28వేల మంది విదేశీయులు, ఎన్నారైలను గుర్తించాం. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి వంద పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా స్థాయిలో 200 పడకలతో కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
52వేల ఎన్-95 మాస్క్‌లు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాష్ట్రంలో 400 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందని పేర్ని నాని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర రూ.2 కోట్ల అత్యవసర నిధి ఉన్నట్టు చెప్పారు. నిత్యావసరాల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉపాధి కూలీలు, వ్యవసాయ కార్మికులు సామాజిక దూరం పాటించాలని తెలిపారు. కరోనాపై ఐదుగురు మంత్రులు, 10 మంది ఐఏఎస్‌లతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
క్వారంటైన్ చేయకుండా రాష్ట్రంలోకి ఎలా అనుమతిస్తామని అన్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదని హెచ్చరించారు. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. నిరాశ్రయులందరినీ కల్యాణమండపాల్లో ఉంచాలని ఆదేశించామన్నారు. దాతలు అధికారుల ద్వారా సాయం అందించవచ్చని కోరారు. భోజనాలకు ఇబ్బందిపడేవారికి వాలంటీర్ల ద్వారా సాయం అందిస్తామని తెలిపారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేశామని చెప్పారు.
ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగిస్తామని తెలిపారు. 52వేల ఎన్-95 మాస్క్‌లను అందుబాటులోకి తెచ్చామని, వైద్యుల కోసం ప్రత్యేక బాడీ మాస్క్‌లను 4వేలకుపైగా సిద్దం చేసినట్టు స్పష్టం చేశారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆస్పత్రులకు కూడా అన్ని వసతులు సమకూర్చినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని, సామాజిక దూరం పాటించి తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని పేర్ని నాని సూచించారు.