ఏపీలో 14వేలు దాటిన కరోనా కేసులు, 187కి పెరిగిన మరణాలు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య 14వేలు దాటింది. తాజాగా 704 పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్త వాటిలో విదేశాలకు చెందిన 5, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 51 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 648 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14వేల 595 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, అనంతపురం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 187కి చేరింది. ఇప్పటివరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,511కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,897.
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకేరోజు 100కుపైగా కేసులు నమోదు:
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 704 పాజిటివ్ కేసులు నమోదవగా.. రెండు జిల్లాల్లో ఏకంగా వందకు పైగా కేసులు నమోదవడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని రోజులుగా జిల్లాలో దాదాపుగా 100 వరకు కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 104 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 107 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మరోసారి జూన్ 21వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయినా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో జిల్లా వాసులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 8మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య కర్నూలు(65), కృష్ణా(63), గుంటూరు(18) జిల్లాల్లో ఎక్కువగా ఉంది.