AP Rain Alert: మరింత బలపడనున్న అల్పపీడనం.. ఏపీలో రేపు భారీ వర్షాలు..! ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలను హెచ్చరించారు.

AP Rain Alert: మరింత బలపడనున్న అల్పపీడనం.. ఏపీలో రేపు భారీ వర్షాలు..! ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

Updated On : September 2, 2025 / 6:39 PM IST

AP Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.

అలాగే తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 88.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వజ్రపుకొత్తూరులో 80.7 మిల్లీమీటర్లు, పలాసలో 70.5 మిల్లీమీటర్లు, రావివలసలో 56.5 మిల్లీమీటర్లు, మదనపురంలో 53.5 మిల్లీమీటర్లు, హరిపురంలో 53 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డైంది.

సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 41.3 అడుగులుగా ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.72 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద సాయంత్రం 5 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,52,772 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలను హెచ్చరించారు.

Also Read: చంద్రబాబు నడిపే హెరిటేజ్‌లో ఉల్లి కేజీ రూ.35.. రైతులకు మాత్రం 8 రూపాయలే.. వైఎస్ జగన్