ఏపీలో కొత్తగా 837 కేసులు..8 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీరిలో విదేశాలకు చెందిన ఇద్దరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించినవి 46 మంది ఉన్నారు.
రాష్ట్రంలో 789 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇతర దేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 16 వేల 934 కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఇక మరణాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
మొత్తంగా కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 206కి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7 వేల 632గా ఉంది. ప్రస్తుతం 9096 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9, 71, 611 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.