రమేష్ బాబు డబ్బు మనిషికాదు…. యాక్టర్ బెనర్జీ సపోర్ట్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ కు మద్దతుగా యాక్టర్ బెనర్జీ నిలిచారు. నిజాయితీకి రమేష్ నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన తప్పు చేసే వ్యక్తి కాదన్నారు. చిన్నతనం నుంచి రమేష్ ఎలాంటి వారో తనకు తెలుసన్నారు. డబ్బుల గురించి ఆలోచించే వ్యక్తి కాదని చెప్పారు.
ప్రజలకు సేవ చేయడానికి ఆయన వైద్య వృత్తిని ఎంచుకున్నారని తెలిపారు. మోరల్స్, ఎథిక్స్ కు ఎక్కువ విలువ ఇస్తారని పేర్కొన్నారు. డబ్బు గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదని వెల్లడించారు. ప్రజలకు సేవ చేద్దామని, మానవులకు వైద్య రూపేనా తన సహకారం అందించాలని వైద్యుడు అయ్యారని తెలిపారు. చిన్నప్పటి నుంచి రమేష్ చాలా తెలివిగల మనిషి, చదువులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే వారని పేర్కొన్నారు.
స్వంత ఊరు బెజవాడలో ఆస్పత్రి పెట్టి, ఊరి ప్రజలకు మంచి వైద్యం అందించాలనుకున్నారు. రమేష్ తలచుకుంటే అమెరికా, లండన్ లాంటి విదేశాలకు ఎప్పుడో వెళ్లిపోయేవారన్నారు. కానీ విజయవాడలో చిన్న హాస్పిటల్ పెట్టి, సిటీలో ఉన్న ప్రజలకు హార్ట్ సర్జన్ గా మంచి సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని పేర్కొన్నారు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. మరో 21 ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల అదుపులో ఉన్న కొడాలి రాజగోపాల్ రావు, కూరపాటి సుదర్శన్, వెంకటేష్ స్టేట్ మెంట్స్ ఆధారంగా కమిటీలు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశాయి. స్వర్ణ ప్యాలెస్, రమేష్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నాయి.
లోపాలున్నాయని తెలిసినా స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను రమేష్ ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసినట్లు అధికారులు తేల్చారు. విద్యుత్ లోపాలను సరిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. అలాగే కోవిడ్ పేషెంట్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు.