Partiala : చిక్కుల్లో పరిటాల సునీత కొడుకు.. ఆ బుల్లెట్ సైనికులు వాడేది
మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కొడుకు పరిటాల సిద్దార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధార్థ్ బుల్లెట్ తో

Paritala Siddhartha
Paritala Siddhartha : మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత చిన్న కొడుకు పరిటాల సిద్దార్థ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధార్థ్ బుల్లెట్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుల్లెట్ ను ఎయిర్ పోర్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వివరణ ఇవ్వాలంటూ సిద్ధార్థ్ కు నోటీసులు ఇచ్చారు.
వాస్తవానికి సిద్ధార్థ్ కు పాయింట్ 32 క్యాలిబర్ గన్ కు లైసెన్స్ ఉంది. అయితే సిద్ధార్థ్ బ్యాగులో లభ్యమైన బుల్లెట్ 5.56 క్యాలిబర్. ఇప్పుడు ఇదే సిద్ధార్థ్ కు ఇబ్బందులు తెచ్చింది. సైనికులు వాడే ఇన్సాస్ రైఫిల్స్ లో ఈ బుల్లెట్లను వాడతారు. దీంతో, ఈ బుల్లెట్ సిద్ధార్థ్ కు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ ప్రారంభమైనట్టు సమాచారం. ఈ బుల్లెట్ అనంతపురం జిల్లాకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (సైన్యంలో ఒక విభాగం)లో పని చేస్తున్న ఒక సైనికుడిదని చెబుతున్నారు. పరిటాల కుటుంబంతో సదరు వ్యక్తికి పరిచయం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రత నిబంధనలకు విరుద్ధంగా బ్యాగ్‌లో బుల్లెట్‌తో విమానం ఎక్కడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పరిటాల సిద్ధార్థ్ పై ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. టీడీపీ యువనేత సిద్ధార్థ్ బుధవారం ఉదయం తన కుటుంబసభ్యులతో శ్రీనగర్ వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఉదయం 5.26కి ఇండిగో విమానం ఎక్కడానికి వచ్చిన ఆయన తన బ్యాగేజ్‌ను కౌంటర్‌లో అప్పగించారు. ఎయిర్ పోర్టు అధికారులు బ్యాగ్‌ను స్కానింగ్ చేసిన నేపథ్యంలో అందులో 5.56 ఎంఎం క్యాలిబర్ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపింది.
బుల్లెట్‌తో పాటు సిద్ధార్థ్‌ను పోలీసులకు అప్పగించారు. తనకు అనంతపురంలో లైసెన్డ్స్ ఆయుధం ఉందని, ఇది దానికి సంబంధించిన బుల్లెట్ అని సిద్ధార్థ్ పోలీసుల విచారణలో చెప్పారు. బ్యాగ్‌లో ఉందన్న విషయం తెలియకే విమానం ఎక్కడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఆయనతో ఆయుధ లైసెన్సుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ సీఆర్పీసీ 41-ఏ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఆయుధ లైసెన్సుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందించాలని ఆదేశించారు.