YSRCP : ఐదుగురు సిట్టింగుల సీట్లు గల్లంతు? కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్‌

ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.

YSRCP : ఐదుగురు సిట్టింగుల సీట్లు గల్లంతు? కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్‌

Tickets Tension For Krishna District YSRCP Leaders

అధికార వైసీపీలో అభ్యర్థుల మార్పు టెన్షన్‌… క్రమంగా ఒక్కో జిల్లాకు విస్తరిస్తోంది. గుంటూరు నుంచి ప్రక్షాళన స్టార్ట్‌ చేయడంతో.. పక్కనే ఉన్న కృష్ణాలోనూ నేతలు కంగారెత్తిపోతున్నారు. ఇప్పటికే గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో మార్పులు చేయడంతో కృష్ణాలోనూ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ జిల్లాలో 16 స్థానాలు ఉండగా, కనీసం ఐదుగురి సీటు గల్లంతు సమాచారం హీట్‌ పుట్టిస్తోంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మచిలీపట్నం నుంచి వైసీపీ గెలవగా, విజయవాడలో టీడీపీ విజయం సాధించింది. ఇక 16 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క విజయవాడ తూర్పు, గన్నవరం నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో గన్నవరం ఎమ్మెల్యే వంశీ.. వైసీపీకి దగ్గరయ్యారు. ప్రస్తుతం అధికారికంగా టీడీపీకి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఒక్కరు మాత్రమే ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం అధికార వైసీపీ భారీ స్కెచ్‌ వేస్తోంది.

ప్రస్తుతం వైసీపీ శాసనసభ్యులు ఉన్న 14 స్థానాలతో పాటు, తన పార్టీకి అనుబంధంగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 15 మందిలో ఐదుగురిని తప్పించాలని అధికార పార్టీ భావిస్తోందనే సమాచారంతో ఎమ్మెల్యేలు టెన్షన్‌ పడుతున్నారు. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యేలకు సూచాయగా తెలియజేసినట్లు చెబుతున్నారు. ఐతే ఐదు నియోజకవర్గాల్లో రెండు చోట్ల టికెట్లు అసలు ఇవ్వకూడదని.. మిగిలిన మూడు చోట్ల సిట్టింగ్‌లను వేరే స్థానాలకు మార్చాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ మార్పుచేర్పులకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.

Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?

పార్టీలో ప్రక్షాళన ప్రారంభించాక.. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సామినేని ఉదయభాను, సింహాద్రి రమేశ్‌తోపాటు పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేశ్‌ తదితరులు సీఎం జగన్‌ను కలిశారు. వీరు ఎందుకు కలిసిందీ స్పష్టంగా తెలియనప్పటికీ వీరిలో కొందరిని వచ్చే ఎన్నికల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది.

ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను తప్పించి ఆయన స్థానంలో మంత్రి అంబటి రాంబాబును తీసుకువస్తారని చెబుతున్నారు. మంత్రి అంబటికి అవనిగడ్డతో మంచి సంబంధాలు ఉండటం.. స్థానిక ఎమ్మెల్యేకు కాస్త ప్రతికూల వాతావరణం ఉందనే సర్వే రిపోర్ట్‌లతో మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

ఇక తిరువూరులో కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైసిపి ఎమ్మెల్యేగా కొక్కిరిగడ్డ రక్షణనిధి ఉన్నారు. ఈయనపై కొంత వ్యతిరేకత ఉన్నట్లు వైసీపీ సర్వేలో తేలిందంటున్నారు. అదే విధంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల ఆధిక్యంతోనే గెలిచారు. ఈసారి ఈ స్థానం నుంచి నగరంలో ఉన్న మరో ఎమ్మెల్యేను మార్చుతారని అంటున్నారు. అలా జరిగితే విష్ణు పరిస్థితి ఏంటన్నది తెలియడం లేదు.

ఇక పెడన నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేశ్‌ ఎప్పటి నుంచో తన సొంత నియోజకవర్గం మైలవరంపై ఆశలు పెంచుకుంటున్నారు. మైలవరంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నారు. మంత్రి జోగికి.. వసంత కృష్ణప్రసాద్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఈ ఇద్దరి మధ్య గ్రూప్‌ వార్‌పై సీఎం పేషీ కూడా కలగజేసుకుంది. మంత్రి జోగి సొంత ఊరు.. ఆయన అనుచరవర్గం అంతా మైలవరంలో ఉండటంతో వచ్చేసారి ఆయన ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక మైలవరం ఎమ్మెల్యేను విజయవాడ ఎంపీగా బరిలోకి దింపుతారని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు ఆయన నెలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక మచిలీపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. తన స్థానంలో కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. అయితే ఇందుకు హైకమాండ్‌ ఓకే చెబుతుందా..? లేక.. వేరొకరికి చాన్స్‌ ఇస్తుందా అనేది తెలియాల్సివుంది. తన కుటుంబానికి టికెట్‌ ఇచ్చినా లేకున్నా.. పార్టీకి విధేయంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించారు మాజీ మంత్రి పేర్ని నాని.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

పేర్ని అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటానని చెబుతుండటంతో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తన అనుచరుడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారనే సమాచారం హీట్‌ పుట్టిస్తోంది. ఎంపీ బాలశౌరికి సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో బందరు రాజకీయం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇలా కృష్ణా తీరంలో రాజకీయ అలజడి రేగడంతో ఎవరి సీటు గల్లంతువుతుందనేదే హాట్‌ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కీలకంగా పని చేసిన కృష్ణా జిల్లాలో ఈసారి విక్టరీ కొట్టాలంటే ప్రజా వ్యతిరేకత అధిగమించక తప్పదని భావిస్తోంది వైసీపీ. అందుకోసం సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోందంటున్నారు.