ఏపీలో హింసాత్మక ఘటనలు.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్ష

చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ఏపీలో హింసాత్మక ఘటనలు.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉన్నత స్థాయి సమీక్ష

Andhra Pradesh DGP Harish Kumar Gupta review on post poll violence

AP DGP Review on Post poll violence ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలకు, రేంజ్ డీఐజీ లకు, ఐజీలను ఆదేశించారు. చట్టం అతిక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

సోషల్ మీడియాపై నిఘా పెట్టాలని, కవ్వింపు చర్యలకు పాల్పడే వారిని గుర్తించాలన్నారు. జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి జిల్లాలో జరిగిన దాడుల గురించి డీజీపీ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పుడికే అదనపు భద్రతా బలగాలను పంపించినట్టు డీజీపీ తెలిపారు. ఆయా ప్రాంతాలలో 144 సెక్షన్ విధించి.. రాజకీయ పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసి వారి భద్రతలను కట్టుదిట్టం చేసినట్టు వివరించారు. జమ్మలమడుగు, తాడిపత్రి, పల్నాడు, తిరుపతి, ఏలూరు ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో బాధ్యులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.