Andhra Pradesh : ఏపీకి వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రైతులు, మత్స్యకారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

AP Rain Alert
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం నాటికి నైరుతిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.
Also Read : బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో తుపాన్ ముప్పు.. ఐఎండీ హెచ్చరిక
వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.