Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 2 రోజులపాటు సంతాప దినాలు
జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించవద్దని..

Ramoji Rao
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు నివాళిగా సంతాపం వ్యక్తం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించవద్దని చెప్పారు. అలాగే, రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ సర్కారు తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు వెళ్లనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ హాజరుకానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున రామోజీరావు పార్దీవ దేహంపై పుష్ప గుచ్ఛం ఉంచి నివాళి అర్పించనున్నారు.
కాగా, రామోజీ రావు అంత్యక్రియలను తెలంగాణ సర్కారు అధికారిక లాంఛనాలతో జరపనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావుకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు- పవన్ కల్యాణ్