రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు- పవన్ కల్యాణ్

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన అన్నీ తట్టుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి.

రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : రామోజీరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధివదేహానికి ఆయన నివాళి అర్పించారు. మోదీ ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి రామోజీరావును కలవాలని అనుకున్నా.. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయిందని పవన్ కన్నీటిపర్యంతం అయ్యారు. రామోజీరావుని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లేదని పవన్ కల్యాణ్ అన్నారు. రామోజీరావు మరణ వార్త తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చారు. రాగానే రామోజీ ఫిలింసిటీకి చేరుకుని రామోజీ భౌతికకాయానికి అంజలి ఘటించారు.

ఆ విజయం గురించి రామోజీకి తెలియజేయాలనుకున్నా- పవన్ కల్యాణ్
”గత దశాబ్ద కాలంలో ప్రభుత్వాలు ఆయనను చాలా ఇబ్బంది పెట్టాయి. ఆయన అన్నీ తట్టుకున్నారు. ప్రజలను చైతన్యవంతం చేశారు. ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి. వేలాది మంది జర్నలిస్టులను తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావుడు. హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇంత అద్భుతంగా ఉందంటే.. ఆయన కాంట్రిబ్యుషన్ ఎనలేనిది.

అలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాలలో చాలా ఇబ్బంది పెట్టాయి. వాటన్నింటిని తట్టుకున్నారు. ఆయనను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఇవాళ లేవు. ఆ విజయం ఆయనకు తెలియజేయాలి అనుకున్నాం. ఈలోపే ఇలా జరిగిపోయింది. ఇది దురదృష్టకరం. రామోజీ కుటుంబసభ్యులకు, ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీలకు జనసేన, నా తరపున సంతాపం తెలుపుతున్నా. ఈ సమయంలో రామోజీ కుటుంబసభ్యులకు దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నా”.

రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా- చంద్రబాబు
అటు టీడీపీ అధినేత చంద్రబాబు.. రామోజీ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఫిల్మ్ సిటీలో రామోజీ భౌతికకాయానికి ఆయన నివాళి అర్పించారు. రామోజీరావు కుటుంబసభ్యులను చంద్రబాబు దంపతులు ఓదార్చారు. ”రామోజీరావు మరణం బాధాకరం. రామోజీరావు మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.

రామోజీరావు ఒక యుగపురుషుడు. సమాజహితం, తెలుగుజాతి కోసం పని చేశారు. సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ స్థాయికి ఎదిగారు. రామోజీరావు వ్యక్తి కాదు వ్యవస్థ. 40ఏళ్లుగా రామోజీరావుతో కలిసి నడిచా. ఎల్లప్పుడూ ప్రజాపక్షంగానే ఉంటానని రామోజీరావు చెప్పారు. రామోజీ నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా” అని చంద్రబాబు చెప్పారు.

Also Read : కేంద్ర క్యాబినెట్‌లో ఈ శాఖలు తీసుకుంటే ఏపీకి తిరుగుండదు..! – చంద్రబాబు, పవన్‌కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన