కేంద్ర క్యాబినెట్‌లో ఈ శాఖలు తీసుకుంటే ఏపీకి తిరుగుండదు..! – చంద్రబాబు, పవన్‌కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన

మన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే.. ఆదాయ వనరులు సృష్టించుకోవాలి. గ్రాంట్స్, ఫండ్స్ కావాలి. రాష్ట్రం అనేక లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎన్నికల ప్రచారంలో అనే హామీలు ఇచ్చారు. ఇవన్నీ నెరవేర్చాలి.

కేంద్ర క్యాబినెట్‌లో ఈ శాఖలు తీసుకుంటే ఏపీకి తిరుగుండదు..! – చంద్రబాబు, పవన్‌కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన

Central Cabinet Berths : కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కీలకంగా మారారు. చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు. ఈ క్రమంలో తమ డిమాండ్ల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఏపీకి ఇది మంచి అవకాశం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర క్యాబినెట్ లో 6 పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఏయే శాఖలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది? రాష్ట్ర ప్రయోజనాలు ఎలా నేర్చుకోవాలి? ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేయాలి? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ…

”ప్రస్తుత పరిస్థితులు తెలుగు రాష్ట్రాలకు గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా మనం పాటుపడాలి? ఇందుకోసం ఏయే కేబినెట్ బెర్తులు తీసుకోవాలి? ఏ విధమైన అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? అని పార్టీల నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రధానమైన సమస్య నిరుద్యోగం. పెద్ద సంఖ్యలో చదువుకుని బయటకు వస్తున్న యువతరానికి ఉద్యోగాలు లేవు. మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకురాగలం అన్నది ఆలోచన చేయాలి. అలాగే రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు తీసుకురావాలి? ఉపాధి రంగంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్నది ఆలోచించాలి.

1. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అనే శాఖ ఉంటుంది. యువతరానికి స్కిల్స్ నేర్పించడం. వారిని ఉద్యోగులుగా చేయడం కాదు ఉద్యోగ జనకులుగా (ఎంటర్ ప్రెన్యూర్స్ ) తయారు చేయడం.
2. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్.. ఏపీ వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. తర్వాత అక్వా ఉత్పత్తులు కూడా చాలా ఎక్కువ. ఇందులో మనం ఫుడ్ ప్రాసెసింగ్ మొదలు పెట్టామంటే చాలా మంది యువతరానికి ఉద్యోగాలు కల్పించవచ్చు. ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది.

3. మూడో ముఖ్యమైన శాఖ… మినిస్ట్రీ ఆఫ్ టూరిజం.. ఉద్యోగాలను గొప్పగా సృష్టించగల మినిస్ట్రీ ఇది. ఏపీని తీసుకుంటే.. అతి పెద్ద తీర ప్రాంతం కలిగి ఉంది. దీంతో టూరిజం డెవలప్ చేయడానికి స్కోప్ ఉంది. ఏపీ, తెలంగాణలో పర్యాటక స్థలాలు చాలానే ఉన్నాయి. వీటన్నింటిని మనం అభివృద్ధి చేయగలిగితే ఆదాయం గణనీయంగా వస్తుంది. చిన్న చిన్న రాష్ట్రాలు, దేశాలు చూస్తే.. వారి మెయిన్ ఇన్ కమ్ టూరిజం మీద వస్తుంది. ఇంత ప్రకృతి అందాలు, తీర ప్రాంతం, ధార్మిక స్థలాలు.. వీటన్నింటిని బేరీజు వేసుకుని టూరిజం మీద శ్రద్ధ చూపించగలిగితే అటు రాష్ట్రానికి ఆదాయం, ఇటు ఉద్యోగ సృష్టి చేయవచ్చు.

4. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ.. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్. ఇటువంటి మినిస్ట్రీని ఎంచుకోగలిగితే రాష్ట్రంలో ఉద్యోగిత పెంచవచ్చు. సంపద సృష్టించవచ్చు. యువతరాన్ని చక్కగా ప్లేస్ చేయొచ్చు.

ఇటువంటి మినిస్ట్రీలను మనం తెచ్చుకోగలితే తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది. చాలా మంది పెద్ద పెద్ద శాఖలు.. ఆర్థిక, డిఫెన్స్, హైవేస్.. అంటారు..కానీ, మన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సినవి ఏంటంటే.. ఆదాయ వనరులు సృష్టించుకోవాలి. గ్రాంట్స్, ఫండ్స్ కావాలి. రాష్ట్రం అనేక లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఎన్నికల ప్రచారంలో అనే హామీలు ఇచ్చారు. ఇవన్నీ నెరవేర్చాలి. దాంటో యువతరానికి ఉద్యోగాలు కల్పించాలి. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలంటే.. మనం పూనుకోవాలి. ఆదాయం ఎలా తేవాలి? గ్రాంట్స్ ఎలా తీసుకురావాలి? ఈ విధమైన మంత్రిత్వ శాఖలను మనం చూసుకోగలిగితే బాగుంటుంది అన్నది నా సలహా” అని లక్ష్మీనారాయణ వివరించారు.