విశాఖలో వైసీపీకి మరో షాక్.. పార్టీకి మరో నాయకుడి రాజీనామా

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. అధికార వైసీపీ పార్టీకి ఉత్తరాంధ్రలో మరో ఎదురుదెబ్బ తగిలింది.

విశాఖలో వైసీపీకి మరో షాక్.. పార్టీకి మరో నాయకుడి రాజీనామా

Another jolt to YSRCP in Vizag Seethamraju Sudhakar quit YCP

Updated On : December 29, 2023 / 6:28 PM IST

Seethamraju Sudhakar: ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుడెబ్బ తగిలింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ శుక్రవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన వైసీపీ అధినాయకత్వానికి లేఖ రాశారు. రెండు దశాబ్దాలుగా వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఒడిపోయారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేయాలని భావించారు. తనకు టిక్కెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. విశాఖ సౌత్ ఇంఛార్జి ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుధాకర్ చివరకు వైసీపీని వదిలిపెట్టారు.

రాజకీయాల్లో మార్పు సహజం: బొత్స
తమ పార్టీలో సీట్ల మార్పుపై జరుగుతున్నకసరత్తుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయ పార్టీల్లో మార్పు సహజమని ఆయన వ్యాఖ్యానించారు. ”రాజకీయ ప్రక్రియలో భాగంగానే సమన్వయకర్తల మార్పు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇన్‌చార్జిల‌ మార్పు ప్రతి పార్టీలో సాధారణంగా జరుగుతుంది. షర్మిల వల్ల మా పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. చంద్రబాబులా మేము ప్రజలను మోసం చేయలేదు. జగన్ మళ్లీ సీఎం అవుతార”ని ఆయన అన్నారు.

Also Read: భీమవరం సభలో పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ విసుర్లు.. త్యాగాల త్యాగరాజు అంటూ..

మోసం చేశారు: ఎమ్మెల్సీ వంశీకృష్ణ
కాగా, రెండు రోజుల క్రితమే ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. తాజాగా సీఎం జగన్ కు లేఖ రాసి తన ఆవేదన వెలిబుచ్చారు. పార్టీలో ఎంతగానే అవమానించారని, కష్టపడి పనిచేసినా తనను గుర్తించలేదని లేఖలో పేర్కొన్నారు. ఏడేళ్ల పాటు విశాఖ వైసీపీ అధ్యక్షుడిగా పార్టీకి ఎంతో చేశానని చెప్పుకొచ్చారు. విశాఖలో పార్టీ కార్యాలయాన్ని తన సొంత డబ్బుతో నడిపానని, పార్టీ కోసం ఖర్చు పెట్టిన తనను ఆర్థికంగా దెబ్బతీశారని వాపోయారు. తనపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్, మేయర్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు.