AP Rains: ఏపీకి మళ్లీ వర్షం ముప్పు.. బంగాళాఖాతంలో మరో వాయుగుండం..! ఆ జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్..

అల్పపీడనం ప్రభావంతో ఈనెల 24వ తేదీ తరువాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

AP Rains: ఏపీకి మళ్లీ వర్షం ముప్పు.. బంగాళాఖాతంలో మరో వాయుగుండం..! ఆ జిల్లాల్లో భారీ వర్షాలకు చాన్స్..

AP Rains

Updated On : October 19, 2024 / 7:07 AM IST

AP Rain Alert: ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. వరుస తుపానులు, వాయుగుండాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా.. నదులు, వాంగులువంకలు పొంగిపొర్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే, అల్పపీడనం ఏర్పడిన తరువాత దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: Drone Summit 2024: అమరావతిలో డ్రోన్ సమ్మిట్.. దేశంలోనే అతిపెద్ద ఈవెంట్.. ఐదు వేలకుపైగా డ్రోన్లతో డ్రోన్‌ షో..

అల్పపీడనం ప్రభావంతో ఈనెల 24వ తేదీ తరువాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also Read: తెలంగాణలో రిలీవ్.. ఏపీలో రిపోర్ట్‌.. నలుగురు ఐఏఎస్‌లు.. వాట్‌ నెక్ట్స్‌?

గత రెండు నెలలుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో వర్షాల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గడిచిన వారం రోజులుగా దక్షిణ కోస్తా, రాయల సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.