AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక బిల్లులపై చర్చ, చంద్రబాబు అరెస్టుతో వాడీవేడీగా సమావేశాలు
ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు, తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది.

AP assembly sessions
AP Assembly Sessions : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఇవాళ శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై శాసన సభ, శాసన మండలి సమావేశాలు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలన్న విషయాన్ని ఖరారు చేయనుంది.
ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను శాసన సభలో బిల్లుల రూపంలో ప్రవేశ పెట్టి చట్ట సవరణలు చేయనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశ పెట్టి చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు, తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చంద్రబాబు అరెస్టు ఇష్యూ సభలో రచ్చ రచ్చ చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అధికార పార్టీ ఏర్పాట్లు చేసింది. అటు చంద్రబాబు అక్రమ అరెస్టుపై అధికార పార్టీని నిలదీయాలని టీడీపీ సభ్యులు కూడా రెడీగా ఉన్నారు.
దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో సభ సమరానికి అధికార, ప్రతి పక్షాలు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. ఈ సమావేశాల్లో అధికార వైసీపీతో అమీతుమీ తేల్చుకోవాలని టీడీపీ డిసైడ్ అయింది. దీనికి ధీటుగా జవాబు ఇచ్చేందుకు వైసీపీ కూడా రెడీగా ఉంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
చంద్రబాబు అరెస్టు తర్వాత ఎక్కువగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న టీడీపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని టీడీపీ శాసన సభా పక్షం నిర్ణయించింది. ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటంలో వెనక్కు తగ్గకూడదని డిసైడ్ అయింది. చంద్రబాబు అరెస్టుపై సభలోనే నిలదీయడంతోపాటు చంద్రబాబు అరెస్టు అక్రమమంటున్న టీడీపీ అసెంబ్లీ వేదికగా దీనిని లేవనెత్తనుంది.
చంద్రబాబు అరెస్టుపై చర్చ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానించారు. ఒకవేళ చర్చకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా తమ నిరసనను సభలోనే చేపట్టాలని కూడా నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై చర్చకు ప్రభుత్వం ఓకే చెప్పినా చెప్పకపోయినా ఏదైనా రాజకీయంగా తమకు లాభమే కాబట్టి అసెంబ్లీకి వెళ్లడమే బెటర్ అని టీడీపీ డిసైడ్ అయింది.
అటు చంద్రబాబు అరెస్టు సక్రమమే అంటున్న అధికార పక్షం టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆయన అవినీతి రుజువు అయ్యింది కాబట్టే చట్టం అరెస్టు చేసిందని, దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటని అటాక్ చేయబోతుంది. చంద్రబాబు అరెస్టు, కేసులపై అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ కీలక ప్రసంగం చేయనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారంటూ చేసిన పూర్వాపరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు.