Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభం..
పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతినే కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయనుంది.
Amaravati: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ రాజధాని చట్టంలోని సెక్షన్ 5(2) సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం కూడా తెలిపింది. త్వరలో జరగబోతున్న మంత్రివర్గ ఆమోదం తర్వాత సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతినే కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సవరణను కూడా కేంద్రం స్టార్ట్ చేసింది. దానికి న్యాయశాఖ ఆమోదం లభించింది. దీన్ని క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నారు. క్యాబినెట్ లో పెట్టి ఆమోదించిన తర్వాత పార్లమెంటులో పెట్టి చట్టరూప కల్పన చేయనున్నారు. ఆ తర్వాత గెజిట్ విడుదల అవుతుంది. రాజధాని అమరావతికి సంబంధించి రైతులు సుదీర్ఘంగా పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం 30వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు.
2014లో అప్పటి ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులు చేపట్టింది. దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ కంపెనీ రూపొందించింది. ఆ తర్వాత 2019లో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. పాలన వికేంద్రీకరణ నినాదం వినిపించింది. జగన్ ప్రభుత్వం హయాంలో రాజధాని అమరావతి పనులు నిలిచిపోయాయి.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి రాజధాని అమరావతి నిర్మాణ పనులపై దృష్టి సారించింది. అమరావతిని రాజధానిగా చేసుకుని పాలన నడిపిస్తోంది. ఈసారి ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని విషయంలో మార్పులు జరగకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలా జరగాలంటే రాజధానికి చట్టబద్ధత కల్పించాలని నిశ్చయించింది. అమరావతిని పూర్తి స్థాయిలో రాజధానిగా కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం దానికి సవరణ కూడా చేసింది. ఆ సవరణను ఇప్పటికే న్యాయశాఖ ఆమోదించింది. రెండు మూడు రోజుల్లోనే క్యాబినెట్ ముందుకు రాబోతోంది. క్యాబినెట్ భేటీ తర్వాత అమరావతి శాశ్వత రాజధానిగా ఉండబోతోంది.
Also Read: పాదయాత్ర 2.O.. జగన్ వ్యూహం అదేనా? వైసీపీని తిరిగి పవర్‌లోకి తెస్తుందా?
