కేంద్ర వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు : మోడీపై చంద్రబాబు ఫైర్

ఢిల్లీ : రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాఫెల్ ఒప్పందంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ లో భారీ ధర్నా నిర్వహించారు. ’తానాషాహీ హఠావో-దేశ్ బచావో’ పేరుతో కేజ్రీవాల్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రధాని మోడీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలని నిరసన తెలిపారు. ధర్నాకు ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, శరద్ యాదవ్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆనంద్ శర్మ, కనిమొళి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తున్నారని తెలిపారు.
కేంద్ర వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేంద్రం వైఖరితో ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తుల ఫోన్లను మోడీ ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. విపక్ష నేతల ఫోన్ లను ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సుపరిపాలన అందిస్తున్నా.. కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు. మోడీ పాలనలో దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచివుందన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.