AP Matsyakara Bharosa 2026 : ఏపీలో మత్స్యకార భరోసా డబ్బులు రిలీజ్.. రాకుంటే ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు కీలక సూచన
AP Matsyakara Bharosa 2026 : నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మత్స్యకారుల సేవలో (మత్స్యకార భరోసా) పథకం కింద మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయంను సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు.
AP Matsyakara Bharosa 2026
- మత్స్యకారులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
- మత్స్యకారుల సేవలో పథకం నిధులు విడుదల
- విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
AP Matsyakara Bharosa 2026 : ఏపీ ప్రభుత్వం సముద్రంలో వేట నిషేధ కాలంలో (ఏప్రిల్ 15 నుంచి జూన్14వరకు) జీవనోపాధి కోల్పోయే మత్స్యకారులకు అండగా నిలిచేందుకు మత్స్యకారుల సేవలో పథకం కింద నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20వేలు ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. తాజాగా.. ఈ ఏడాదికి సంబంధించిన మత్స్యకారుల సేవలో పథకం కింద నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు కీలక సూచనలు చేశారు.
నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మత్స్యకారుల సేవలో (మత్స్యకార భరోసా) పథకం కింద మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయంను సీఎం చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్హులైన 1,30,796 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.20వేల చొప్పున మొత్తం రూ.262 కోట్లు డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) ద్వారా జమ అయ్యాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మత్స్యకారులతో మాట్లాడుతూ.. మత్స్యకారుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారాలు చూపించారు. మీ ఫోన్లలో డబ్బులు వచ్చాయో లేదో చూసుకోండి.. అర్హులందరికీ డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నాం అని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం. తమిళ జాలర్లు మన వైపు రాకుండా, వాళ్లకు మనకు మధ్య సర్వేలెన్స్ కోసం అటానమస్ పెట్రోలింగ్ బోటును సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు.
మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలనే మత్స్యకారుల సేవలో పేరిట రూ.20 వేల చొప్పున చేయూత అందిస్తున్నాం. మొత్తం 1,30,796 మత్స్యకారుల కుటుంబాలకు రూ.262 కోట్లను బ్యాంకు ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచిస్తూ వారిని ఆదుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ మత్స్యకార కుటుంబానికి 50కేజీల చొప్పున బియ్యం ఇచ్చి సాయం చేశాం. మళ్లీ కూటమి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 వేలకు ఆర్ధిక సాయాన్ని పెంచి ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు.
సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్యకారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత మత్స్యసంపద పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. మత్స్యకారులకు మేం అండగా ఉంటాం. రూ.3256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మత్స్యకారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్ పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. పడవలు, వలలు, పరిహారం సకాలం లోనే ప్రభుత్వం అందిస్తోంది.ఈ తీరం మనది, బోటూ మనదే వేటా మనదే ఈ విషయంలో రాజీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
మన తీరప్రాంతానికి పొరుగు రాష్ట్రం వారు ఎవరు వచ్చినా సహించేది లేదు. మత్స్యకారుల హక్కులు కాపాడతాం. మన తీరప్రాంతంలో నిఘాపెట్టి పొరుగు రాష్ట్రాల బోట్లు రాకుండా చర్యలు తీసుకుంటాం. 200 మెకనైజ్డ్ బోట్లను మన మత్స్యకారులకోసం శాంక్షన్ చేస్తామని హామీ ఇస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 60శాతం సబ్సీడీ ఇవ్వటంతో పాటు మిగిలిన మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తాం. తీరం మనది, బోటు మనదే వేటా మనదే ఇదే సీబీఎన్ మాట అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.
రూ.288 కోట్లతో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నాం. మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నాం. ఈ ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతోంది. దీని ద్వారా స్థానికులకే ఉపాధి, ఉద్యోగా లు లభిస్తాయి. ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదు. దీనిపై కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని చంద్రబాబు మత్స్యకారులకు సూచించారు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారు లను ప్రోత్సహిస్తాం. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం.మత్స్యకార మహిళలు, డ్వాక్రా సంఘాల మహిళలు సముద్రపు నాచు పెంపకం ద్వారా అదనపు ఆదాయం సాధించేలా చేస్తామని చంద్రబాబు తెలిపారు.
