రాజులు కూడా ఇలాంటి ప్యాలెస్‌లు కట్టలేదు..! రుషికొండ భవనాలు చూశాక సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

రాజధాని పేరుతో ప్రజాధనం లూటీ చేశారు. ఇది నేరం కాదా అని చూడాలి.

రాజులు కూడా ఇలాంటి ప్యాలెస్‌లు కట్టలేదు..! రుషికొండ భవనాలు చూశాక సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Updated On : November 2, 2024 / 6:03 PM IST

Visakha Rushikonda Palace : విశాఖ రుషికొండలో భవనాలను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు చంద్రబాబు. ఇవాళ రుషికొండను పరిశీలిస్తే కలలో కూడా ఊహించని విధంగా ఓ వ్యక్తి ఏ విధమైన కార్యక్రమాలు చేశాడో కళ్లారా చూశానన్నారు. ఇక్కడ నిర్మాణాలు చూసేందుకు అనేకమంది ప్రయత్నాలు చేశారు. కానీ, ఎవరూ రాలేకపోయారని వ్యాఖ్యానించారు.

”రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చెయ్యవచ్చో ఇదో కేసు స్టడీ. నేను వచ్చా, పవన్ వచ్చాడు. కానీ ఎవరినీ చూడనివ్వలేదు. ఒక సీఎం తన విలాసాల కోసం పర్యావరణ విధ్వంసం చేసి ప్యాలెస్ లు కట్టుకోవడం నేను ఎక్కడా చూడలేదు. ఆ రోజుల్లో పాలకులు విలాసవంతమైన జీవితాల కోసం ప్యాలెస్ లు కట్టుకునే వారు. అలాంటివి హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చూశా. కానీ ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకునే ధైర్యం చేశారు.

మొదట.. టూరిజం కోసం ప్యాలెస్ కట్టామని అబద్ధాలు చెప్పారు. ఆ తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విడిది కోసం అని బుకాయించారు. ప్రధాని, రాష్ట్రపతి నావెల్ బేస్ లో చిన్న చిన్న రూముల్లో ఉండే వారు. ఎప్పుడూ ప్యాలెస్ కోరుకోలేదు. ఒక్కో బాత్ టబ్ కోసం రూ.36 లక్షలు ఖర్చు చేశారు. జపాన్ టెక్నాలజీ ఉపయోగించి కొండలు జారకుండా కట్టడి చేశారు. విజయనగరం బ్లాక్ లో 4 బాత్ రూమ్ లు ఉన్నాయి. గజపతి బ్లాక్ లో ఆఫీస్ రూమ్ కట్టారు. ఎక్కడ చూసినా సముద్రపు వ్యూ కనపడేలా చేశారు.

కళింగలో 300 మందితో రివ్యూ చేసే కాన్ఫరెన్స్ హాల్ కట్టారు. రాజులు కూడా ఇలాంటి భవనాలు కట్టలేదు. వేంగి బ్లాక్ పని చేసే వారి కోసం కట్టారు. ఏసీ, ఫ్యాన్సీ ఫ్యాన్ లు.. ఇలా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు ఉన్నాయి. వాళ్లకి ఇలాంటి ఇన్నోవేషన్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అందుకే ఆంధ్ర ఎస్కోబార్ అన్నాను.

సర్వే రాళ్ళపై బొమ్మల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేశారు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయచ్చు. దీన్ని ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఇది అరుదైన ప్లేస్. ఇక్కడ క్యాంప్ ఆఫీసు ఏంటో నాకు అర్థం కావడం లేదు. గజపతి బ్లాక్ ఏంటో అర్థం కాలేదు. ఓ ప్లానింగ్, విజన్ లేదు. దీని మీద ఎంత ఖర్చు చేశారు, ఏమేం పెట్టారు అన్నీ వీడియో తీస్తాం. ప్రజలను ఇక్కడికి అనుమతిస్తాం. వారి అభిప్రాయాలూ తీసుకుంటాం. అప్పుడు ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటాం. రాజధాని పేరుతో ప్రజాధనం లూటీ చేశారు. ప్రజాస్వామ్యవాదులు ఛీకొట్టే విధంగా ఉంది. ఇది నేరం కాదా అని చూడాలి. నేరం చేసిన వాడిని ఏం చేయాలి అనే దానిపై చర్చ జరగాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.

రుషికొండ ప్యాలెస్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
* ప్యాలెస్ కోసం కొండ మొత్తం ఆక్రమించారు
* ఒక సీఎం తన విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడాన్ని నేను ఎక్కడా చూడలేదు
* ఇలాంటి పనులు చేస్తారని ఎవరూ కలలో కూడా ఊహించరు
* ప్రజాధనంతో ఇలాంటి భవనాలు కట్టుకోవడం దారుణం
* భవనాలు చూసి ఆశ్చర్యం, ఉద్వేగం కలిగాయి
* విలాసవంతమైన ఏడు బ్లాక్ లు కట్టారు
* బాత్ టబ్ కోసం రూ.36 లక్షలు ఖర్చు పెట్టారు
* భవనాలకు మార్బుల్స్ ను విదేశాల నుంచి తెప్పించారు
* భవనాల వద్ద 100 కేవీ సబ్ స్టేషన్ నిర్మించారు
* భవనాల్లో ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టారు

* 200 టన్నుల సెంట్రల్ ఏసీ పెట్టారు
* భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సీ వ్యూ కనిపించేలా కట్టారు
* టూరిజం కోసమే కడుతున్నామని నమ్మించారు
* ప్రధాని, రాష్ట్రపతి వస్తే విడిది కోసం భవనాలు కట్టామన్నారు
* వాళ్లు ఎప్పుడూ ఇలాంటి విలాస ప్యాలెస్ లు కావాలని కోరుకోలేదు
* ఒకప్పుడు రాజులు విలాసవంతమైన ప్యాలెస్ లు కట్టుకునే వాళ్లు
* ఇప్పుడు ప్రజాధనంతో ప్యాలెస్ నిర్మించారు
* రాజులు కూడా ఇలాంటి ప్యాలెస్ లు కట్టుకోరేమో
* ఎన్జీటీ, కోర్టులు, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టారు
* అధికారులను బెదిరించి పనులు చేయించారు

* పేదల పేరుతో విలాసవంతమైన ప్యాలెస్ లు కట్టుకున్నారు
* ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికివస్తారా? ప్రజలు ఆలోచించుకోవాలి
* రుషికొండ నిర్మాణాలపై చర్చలు జరగాలి

Also Read : చంద్రబాబు చెప్పింది ఎంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి?: బొత్స సత్యనారాయణ