విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రధానికి సీఎం జగన్ లేఖ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రధానికి సీఎం జగన్ లేఖ

Updated On : February 7, 2021 / 7:16 AM IST

AP CM writes to PM on revival of Vizag steel plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖరాశారు. స్టీల్‌ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్‌ ప్రధానిని కోరారు. ప్లాంట్‌ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ద్వారా 20 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నట్టు లేఖలో తెలిపారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈ ఫ్యాక్టరీ వచ్చిందని జగన్‌ తన లేఖలో తెలిపారు. దశాబ్దం పాటు ప్రజలు పోరాటం చేశారని.. నాటి ఉద్యమంలో 32మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరగడంతో ప్లాంట్‌కు కష్టాలు వచ్చాయని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా గనుల్లేవని జగన్‌.. ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడటం ద్వారా ప్లాంట్‌ను ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చని జగన్‌ సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 7.3 మిలియన్‌ టన్నులని.. అయితే 6.3 మిలియన్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. గత డిసెంబర్‌లో ప్లాంట్‌కు ఏకంగా 200 కోట్లమేర లాభం కూడా వచ్చిందన్నారు. వచ్చే రెండేళ్లలో ఇలాగే కొనసాగితే ప్లాంట్‌ ఆర్థికపరిస్థితి మెరుగవుతుందని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాల్సిన అవసరం ఉందని జగన్‌ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ప్లాంట్‌పై భారం తగ్గతుందని.. బ్యాంకుల రుణాలను వాటా రూపంలోకి మార్చితే ఊరట కలుగుతుందన్నారు జగన్‌.