CBI inquiry on Antarvedi : అంతర్వేదిలో కరోనా కలకలం, ఎస్పీ, ఇతర పోలీసులకు సోకిన వైరస్

Ratham
అంతర్వేదిలో కరోనా కలకలం రేపింది. దగ్ధమైన రథం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైరస్ సోకింది. దీంతో వారందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఎస్పీ నయీమ్ కరోనా బారిన పడ్డారన్న విషయం బయటపడింది. ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ దుర్గా శేఖర్ తో పాటు ఐదుగురు ఎస్ఐలు, పలువురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో వీరందరూ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. వైరస్ విస్తరించుకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం కావడంతో..అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆందోళనలు, నిరసనలకు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించాలని పట్టుబట్టాయి.
ఈ క్రమంలో శాంతి భద్రతలు క్షీణించకుండా ఉండేందుకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం దగ్దం కావడంతో పలు పార్టీల కార్యకర్తలు, హిందూ సంఘాలు అంతర్వేది చేరుకుని ఆందోళన చేపట్టాయి. ఎస్పీ స్థాయి అధికారులు అక్కడ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్న నేపథ్యంలో… అంతర్వేదిలో విధులు నిర్వహించిన పోలీసులకు కూడా కరోనా సోకడం గమనార్హం.
అంతర్వేది ఆలయ ఆవరణలో స్వామి వారి దివ్య రథం దగ్ధమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచిన తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో శనివారం (సెప్టెంబర్ 5) అర్ధరాత్రి దాటాక అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి సుమారు 1.45 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అంతర్వేది ఘటనతోపాటు, తిరుమల బస్సుపై శిలువబొమ్మలు, టీటీడీ వెబ్‌సైట్, సప్తగిరి మాసపత్రికలో అన్యమత ప్రస్తావన వంటివాటిని సిబిఐ పరిధిలోకి తీసుకురాబోతున్నారు. పిఠాపురం, నెల్లూరు ఘటనలతోపాటు, టీడీడీ ఛైర్మన్‌పై చేసిన దుష్ప్రచారాన్ని సిబిఐతో విచారణ జరిపించాలనుంటున్నారు.
అంటే మతపరమైన అన్ని వివాదాలపై సిబిఐ ఎంక్వైరీ అంటే ఒక్క దెబ్బతో అన్నింటికి సమాధానం చెప్పే అవకాశం వైసీపీకొస్తుంది. దగ్ధం చేయడం అంటే చంద్రబాబుకి సరదా అన్న మంత్రి వెల్లంపల్లి.. తుని రైలు, దేవుడి రథాల దగ్ధం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే..శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తులో, 7 అంతస్తులు, ఆరు చక్రాలతో నూతన రథం డిజైన్ సిద్ధం చేశారు. కొత్త రథం నిర్మాణతో పాటు షెడ్డు మరమ్మతులు, షెడ్డు షెట్టర్ నిర్మాణానికి 95 లక్షల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఫిబ్రవరిలో జరిగే స్వామివారి కల్యాణోత్సవాల నాటికి రథం సిద్ధం చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇక రథం ఆకృతిపై చర్చించి.. ప్రభుత్వానికి ఆలయ అధికారులు నివేదిక సమర్పించనున్నారు.