Pawan Kalyan: జాగ్రత్త.. పర్మినెంట్‌గా అధికారానికి దూరం చేస్తా- వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
విధానాలపై ప్రశ్నిస్తే స్వాగతిస్తా.. తప్పదనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్ట్ మడతపెడతాం అని పవన్ వ్యాఖ్యానించారు.
Pawan Kalyan: వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ నాయకులు బెదిరించడం మానుకోవాలన్నారు. లేదంటే పర్మినెంట్ గా అధికారంలోకి రాకుండా ఏం చేయాలో తనకు బాగా తెలుసున్నారు. మంగళగిరిలో నిర్వహించిన పదవి-బాధ్యత సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తనకు ఎవరూ శత్రువులు లేరని పవన్ కల్యాణ్ చెప్పారు. వారి విధానాలతోనే తనకు సమస్య ఉందన్నారు. ఆకు రౌడీలను ప్రోత్సహించే పార్టీని తాను గుర్తించను అని అన్నారు. విధానాలపై ప్రశ్నిస్తే స్వాగతిస్తా.. తప్పదనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్ట్ మడతపెడతాం అని పవన్ వ్యాఖ్యానించారు.
”రౌడీలను ప్రోత్సహించే నాయకులు తయారయ్యారు. మహిళలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారు. మళ్లీ వస్తే అంతు చూస్తామనడం ప్రజాస్వామ్యం కాదు. మేం వస్తే మీ సంగతి చూస్తామనడం మన విధానం కాదు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పనులు వద్దు. రౌడీలను సపోర్ట్ చేసే పార్టీలను గుర్తించాల్సిన పని లేదు. రౌడీలను, గంజాయి బ్యాచ్ ను వెనకేసుకొస్తామంటే కుదరదు. వైసీపీ నాయకులు బెదిరించుకోవడం మానుకోవాలి. ఇప్పటికైనా వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. రాజ్యాంగబద్ధంగానే ఉంటా, తప్పదనుకుంటేనే గొడవకు వెళ్తా. నాకు ఎవరూ శత్రువులు కాదు. విధి విధానాలతోనే వ్యతిరేకిస్తా. మీ విధి విధానాలతో ప్రజలకు ఇబ్బంది కలిగితే నేను గొడవ పెట్టుకోవడానికి లైఫ్ లాంగ్ సిద్ధమే. నేను దేనికీ భయపడను. పోలవరం ప్రాజెక్ట్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలి. ఇది నా ప్రతిపాదన, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
ఒక మాజీ ముఖ్యమంత్రి.. మిమ్మల్ని చంపేస్తాం, మేమంటే ఏంటో మీకు చూపిస్తాం అని పోలీసులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారంటే.. అది రాంగ్ సిగ్నల్ ను పంపుతుంది. అలాంటి వ్యాఖ్యలకు నా సమాధానం ఒక్కటే. పర్మినెంట్ గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు..
వైసీపీ నాయకులు బెదిరించడాలు మానేయాలిక. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య, పార్లమెంటరీ భాషకు రండి. ఒక వేళ వాళ్లు అధికారంలోకి వచ్చేస్తారేమో అని అధికారులు, ప్రజలు భయపడాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితులు రావు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఏపీ, దేశ సమగ్రతకు భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు రౌడీలను వెనకేసుకొస్తాం అంటే ఊరుకోను” అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
అటు.. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీని నడపటం అంత సులభం కాదన్నారు పవన్ కల్యాణ్. ఓడిపోయినప్పుడు అండగా నిలిచినందుకే మీకు పదవులు వచ్చాయన్నారు. ”దాదాపు 4వేల మందికి పదవులు వచ్చాయి. పదవి అంటే బాధ్యత. ప్రజా సేవలో మరింత చురుగ్గా ఉండాలి. పదవి చిన్నదైనా, పెద్దదైనా బాధ్యతగా పని చేయాలి. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది. ప్రాంతీయతత్వం, కులాల ఆధారంగా పార్టీలు నిలబడవు. కొత్త పంథాను నమ్ముకుని వేలాది మంది యువత నక్సల్స్ లో చేరారు. సిద్ధాంతాన్ని వదులుకోలేక అనేక మంది యువత ప్రాణాలు కోల్పోయారు. మనం ఏం చేసినా రాజ్యాంగానికి లోబడే పని చేయాలి” అని పవన్ అన్నారు.
Also Read: ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. ఆ సేవలన్నీ ఇకపై ఉచితంగా.. వెంటనే ఇలా చేయండి..
