ఆ అధికారులను, వైసీపీ నేతలను వదిలిపెట్టం- నారా లోకేశ్ వార్నింగ్

ఎవరూ ఊహించని మెజార్టీతో నా మీద మరింత బాధ్యత పెరిగింది. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం.

ఆ అధికారులను, వైసీపీ నేతలను వదిలిపెట్టం- నారా లోకేశ్ వార్నింగ్

Updated On : June 5, 2024 / 1:14 AM IST

Nara Lokesh : ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ యువ నేత నారా లోకేశ్ స్పందించారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామని చెప్పారు. ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. 1999 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవలేదని, కానీ ఈసారి రికార్డు మెజార్టీతో టీడీపీ విజయం సాధించిందని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నాకు తెలిసి రాష్ట్రంలో నాది మూడవ అత్యధిక మెజార్టీ అని లోకేశ్ అన్నారు.

”మంగళగిరిలో గెలిచి పవన్ కల్యాణ్ కు కానుకగా ఇస్తానని చెప్పాను. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. ఎవరూ ఊహించని మెజార్టీతో నా మీద మరింత బాధ్యత పెరిగింది. టీడీపీ, జనసేన శ్రేణుల కృషితో మంగళగిరిలో జెండా ఎగరేశాం. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను, వైసీపీ వాళ్లపై చట్టపరంగా విచారణ చేపడతాం” అని నారా లోకేశ్ అన్నారు.

”నా యువగళం పాదయాత్రలో నేను చాలా స్పష్టంగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చాను. ఏ అధికారులు, వైసీపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్లపైన ఎంక్వైరీ వేస్తాం. అధికారులపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తాం. ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం. వారిని జైలుకి పంపించడానికి కూడా నేను వెనుకాడను అని ఆనాడు ప్రజలకు చెప్పా, కార్యకర్తలకు చెప్పా. అది ప్రజలు ఒప్పుకున్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా మాకు మెజార్టీ విజయం వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన మాటను, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటా” అని నారా లోకేశ్ తేల్చి చెప్పారు.

”కక్ష సాధింపులు, వేధింపులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం మాకు రాదు, మేము చేయం. ఇదంతా వైసీపీకి తెలిసింది. అందుకే ప్రజలు ఇవాళ ఇలాంటి తీర్పు ఇచ్చారు. ప్రజలు మాపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తాం. ప్రజలకు సేవ చేసే దిశగా మేము పని చేస్తాం. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత మాపై ఉంది” అని నారా లోకేశ్ అన్నారు.

”గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ మేము ఎప్పుడూ కుటుంబసభ్యుల జోలికి వెళ్లలేదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి ఎవరినైనా జైలుకి పంపించాలన్న ఆలోచన గతంలో మాకు లేదు. ఇప్పుడు కూడా లేదు. తప్పులు చేసి చట్టాలు తమ పని చేసుకుంటూ వెళ్తాయి తప్ప మేము ఎక్కడా ప్రజలను ఇబ్బంది పెట్టాలనో, వైసీపీ నాయకులపైన కక్ష సాధింపు చేయాలనేది మా ఆలోచన కానే కాదు” అని లోకేశ్ స్పష్టం చేశారు.

Also Read : వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు