ఏపీలో వార్ వన్‌సైడ్.. 8 జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్, 90శాతం సీట్లు కైవసం.. జిల్లాల వారీగా వివరాలు
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 10 సీట్లతో సరిపెట్టుకుంది.

AP Election 2024 Results : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీలోనూ కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం నమోదు చేశారు. 164 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో విజయబావుటా ఎగరవేశాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. కూటమి సునామీలో తుడిచిపెట్టుకుపోయింది. ఘోర పరాభవాన్ని చవి చూసింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ.. ఈసారి 11 సీట్లతో సరిపెట్టుకుంది.
వైసీపీ కంచుకోటకు బీటలు..
ఏపీ ఎన్నికల్లో కూటమి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా వైసీపీ 2019 ఎన్నికల్లో సాధించిన 151 సీట్ల విజయాన్ని కూటమి ఈసారి క్రాస్ చేసింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని కనబరిచారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలోనూ కూటమినే ఎక్కువ స్థానాలు గెలుపొందింది.
8 జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైసీపీ. ఏకంగా 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది.
ఏపీ ఫైనల్ రిజల్ట్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఎన్డీయే కూటమిలోని టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135, జనసేన 21కి 21, బీజేపీ 10కి 8 చోట్ల గెలుపొందాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
కృష్ణా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..
కృష్ణా జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గన్నవరం, గుడివాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, మైలవరంతో పాటు నందిగామ, నూజివీడు, పామర్రులో సైకిల్ జోరు చూపించింది. పెడన, పెనమలూరు, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ లోనూ టీడీపీనే విజయం సాధించింది. ఇక, విజయవాడ వెస్ట్, కైకలూరులో బీజేపీ గెలుపొందగా.. అవగడ్డలో జనసేన జెండా ఎగురవేసింది.
గుంటూరులో 17కి గాను 16 స్థానాలు కైవసం..
గుంటూరులోని 17 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో టీడీపీ, ఒక చోట జనసేన దుమ్ముదులిపేశాయి. బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ తో పాటు గురజాల, మాచర్ల, మంగళగిరి, నరసరావుపేటలో టీడీపీ జోరు చూపించింది. పెదకూరపాడు, పొన్నురు, రేపల్లె, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, తాడికొండ, వేమూరు, వినుకొండలో సైకిల్ పార్టీ దూసుకెళ్లింది. ఇక తెనాలిలో జనసేన సక్సెస్ కొట్టింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 10కి 10 స్థానాలను కైవసం చేసుకుంది. ఆత్మకూరు, గూడూరు, కావలి, కోవూరుతో పాటు నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, సూళ్లూరుపేట, ఉదయగిరి, వెంకటగిరిలో టీడీపీ విజయం సాధించింది.
ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ 10 స్థానాల్లో గెలిచింది. అద్దంకి, చీరాల, గిద్దలూరు, కందుకూరుతో పాటు కనిగిరి, కొండపి, మార్కాపురం, ఒంగోలు, పర్చూరు, సంతనూతలపాడులో టీడీపీ జెండా రెపరెపలాడింది. కేవలం రెండు స్థానాల్లో (ఎర్రగొండపాలెం, దర్శి) మాత్రమే వైసీపీ గెలుపొందింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19కి 19 స్థానాలు కైవసం..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి దూకుడు చూపించింది. 19కి 19 స్థానాల్లో కూటమి పార్టీలు సక్సెస్ కొట్టాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అమలాపురం, జగ్గంపేట, కాకినాడ అర్బన్ తో పాటు కొత్తపేట, మండపేట, ముమ్మడివరం, పెద్దాపురం, ప్రత్తిపాడు, రామచంద్రపురం, రంపచోడవరం, తునిలో టీడీపీ విజయం సాధించింది. ఇక కాకినాడ రూరల్, పి.గన్నవరం, పిఠాపురం, రాజానగరం, రాజోలులో జనసేన జెండా ఎగురవేసింది. ఈ జిల్లాలో అనపర్తి సీటును బీజేపీ కైవసం చేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో వార్ వన్ సైడ్..
ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి వన్ సైడ్ గా దూసుకెళ్లింది. ఆచంట, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గోపాలపురంతో పాటు కొవ్వూరు, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ విజయం సాధించింది. భీమవరం, నర్సాపురం, నిడదవోలు, పోలవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో జనసేన సక్సెస్ కొట్టింది.
విజయనగరంలోనూ కూటమి క్లీన్ స్వీప్..
ఇక విజయనగరంలోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాంతో పాటు పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, విజయనగరంలో టీడీపీ సీట్లు సాధించింది. నెల్లిమర్లలో మాత్రం జనసేన జెండా ఎగరేసింది. ఇక శ్రీకాకుళంలో ఆముదాలవలస, ఇచ్చాపురం, నరసన్నపేటతో పాటు పలాస, పాతపట్నం, రాజాం, శ్రీకాకుళం, టెక్కలిలో టీడీపీ జోరు చూపించింది. పాలకొల్లులో జనసేన సక్సెస్ సాధించగా ఎచ్చెర్లలో బీజేపీ గెలుపొందింది.
విశాఖ జిల్లాలోనూ టీడీపీ జోరు.. 15కి గాను 13 చోట్ల విజయం..
విశాఖ జిల్లాలోనూ టీడీపీ జోరు చూపించింది. ఈ జిల్లాలో 15 స్థానాలకుగాను 13 చోట్ల కూటమి పార్టీలు గెలుపొందగా.. రెండు చోట్ల వైసీపీ విజయం సాధించింది. భీమిలి, చోడవరం, గాజువాక, మాడుగులతో పాటు నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ వెస్ట్, విశాఖ ఈస్ట్ లో సైకిల్ పార్టీ దూసుకెళ్లింది. అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, విశాఖ సౌత్ లో జనసేన గెలవగా.. విశాఖ నార్త్ లో బీజేపీ విజయం సాధించింది. అరకు, పాడేరులో మాత్రం వైసీపీ నెగ్గింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలు క్లీన్ స్వీప్..
ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, కల్యాణదుర్గంతో పాటు మడకశిర, పుట్టపర్తి, రాప్తాడు, పెనుగొండలో టీడీపీ విజయం సాధించింది. రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండలోనూ టీడీపీ గెలుపొందగా ధర్మవరంలో మాత్రం బీజేపీ కాషాయ జెండాను ఎగురవేసింది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు 12 చోట్ల గెలుపు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకుగాను 12 చోట్ల కూటమి హవా కొనసాగింది. చంద్రగిరి, చిత్తూరు, గంగాధరనెల్లూరు, కుప్పంతో పాటు మదనపల్లె, నగరి, పీలేరు, పూతలపట్టు, పలమనేరు, సత్యవేడు, శ్రీకాళహస్తిలో టీడీపీ విజయం సాధించింది. తిరుపతిలో కూటమి పార్టీ జనసేన గెలవగా.. తంబళ్లపల్లె, పుంగనూరులో మాత్రం వైసీపీ జెండా ఎగురవేసింది.
కడపలో కూటమి దూకుడు..
కడపలో 3 చోట్ల వైసీపీ విజయం సాధించగా, 5 చోట్ల టీడీపీ, ఒక్కో సీటు చొప్పున బీజేపీ, జనసేన గెలుపొందాయి. బద్వేలు, పులివెందుల, రాజంపేటలో వైసీపీ గెలవగా.. కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటిలో టీడీపీ విజయం సాధించింది. జమ్మలమడుగులో బీజేపీ, రైల్వేకోడూరులో జనసేన సక్సెస్ కొట్టాయి.
కర్నూలు జిల్లాలో 14కి గాను 11 చోట్ల కూటమి విజయం..
కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో 11 చోట్ల టీడీపీ, రెండు చోట్ల వైసీపీ, ఒక చోట బీజేపీ గెలుపొందాయి. ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, పత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. ఆలూరు, మంత్రాలయంలో వైసీపీ గెలవగా.. ఆదోనీలో బీజేపీ గెలుపొందింది.
పార్లమెంట్ తుది ఫలితాలు ఇలా..
ఇక ఏపీ లోక్ సభ ఎన్నికల్లో తుది ఫలితం ఇలా ఉంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను టీడీపీ 16, వైసీపీ 4, బీజేపీ 3, జనసేన 2 సీట్లను కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కూటమి సునామీలో కొట్టుకుపోయింది. కడప, రాజంపేట, తిరుపతి, అరకు లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
Also Read : వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు