మహిళా కోటాలో అమాత్య యోగం ఎవరికి దక్కుతుందో?

ఈ పరిస్థితుల్లో మహిళా మణుల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

మహిళా కోటాలో అమాత్య యోగం ఎవరికి దక్కుతుందో?

Updated On : June 11, 2024 / 9:20 PM IST

ఏపీలో కాబోయే మంత్రివర్గంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఐతే మహిళల కోటాలో ఎవరికి మంత్రి యోగం దక్కుతుందనేది ప్రధానంగా ఆసక్తి రేపుతోంది. ఏపీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో మహిళా నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తం 22 మంది మహిళా ప్రతినిధులు ఉండగా, ఇందులో అధికార పక్షమే 21 మంది… దీంతో ఈ 21 మందిలో ఎవరికి అదృష్టం వరిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది.

ఏపీ కొత్త ప్రభుత్వంలో మంత్రులయ్యే కొత్త నేతలు ఎవరన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ప్రస్తుత ప్రభుత్వంలో 21 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది టీడీపీ తరఫునే ఎన్నికయ్యారు. దీంతో మహిళా కోటాలో అమాత్య యోగం ఎవరికి దక్కుతుందోనది ఉత్కంఠగా మారింది.

గతంలో..
టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎక్కువ మంది తొలిసారే ఎన్నికైన వారు ఉండగా, గతంలో మంత్రిగా పనిచేసిన పరిటాల సునీత, మూడుసార్లు ఎన్నికైన నేతగా కోళ్ల లలితకుమారి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇక కొత్తగా ఎన్నికైన వారిలో గౌతు శిరీష, అదితి గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా రేసులో ఉన్నామంటున్నారు. వీరిలో ఎవరికి పదవులు దక్కుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.

చంద్రబాబు మంత్రివర్గంలో మహిళలకు మూడు పదవులిచ్చే అవకాశం ఉందంటున్నారు. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ తరపున ఒకే ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలవగా, ఒక్కరు కూడా మహిళా నేత లేరు. ఇక జనసేన నుంచి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఒక్కరే మహిళా నేత. మిగిలిన 20 మంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులే కావడం విశేషం.

బాబు స్టాండ్‌ ఏంటి?
మంత్రివర్గంలో తీసుకోబోయే మహిళా నేతల విషయంలో బాబు ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. వీరిని గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందని మెజార్టీ క్యాడర్‌ డిమాండ్‌ చేస్తోంది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గత ఐదేళ్లలో తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు.

వారిద్దరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉందంటున్నారు. ఇక రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని కేసుల్లో ఇరుక్కుని జైలుకు కూడా వెళ్లారు. అఖిలప్రియ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా రాయలసీమలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన పరిటాల కుటుంబం నుంచి సునీతకు మరోసారి అవకాశం ఇస్తారా? లేదా? అన్నది కూడా చర్చకు తావిస్తోంది.

డిమాండ్ ఎక్కువే..
అదేవిధంగా రాయలసీమలో కీలకమైన రెడ్డి సామాజివర్గానికి చెందిన మహిళా నేతలు మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ముఖ్యంగా కడపలో రికార్డుస్థాయి విజయం సాధించిన రెడ్డప్పగారి మాధవీరెడ్డిని ఎట్టిపరిస్థితుల్లోనూ మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందేనన్న డిమాండ్‌ వినిపిస్తోంది. కడపలో వైఎస్‌ కుటుంబాన్ని ఎదిరించి పోరాడటమే కాకుండా, గతంలో ఎన్నడూ గెలవని చోట నిలిచి గెలిచారని మాధవీరెడ్డి మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే విధంగా కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గౌరు చరితారెడ్డి మంత్రి పదవికి గట్టిపోటీదారుగా చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, గౌరు చరితారెడ్డి ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో ఎవరికి పదవి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేయడంలో వేమిరెడ్డి దంపతుల పాత్ర ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళా మణుల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read: ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి? నవ్యాంధ్రలో నవశకం తీసుకురాబోతున్నారా?