ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి? నవ్యాంధ్రలో నవశకం తీసుకురాబోతున్నారా?

ప్రమాణ స్వీకారం తర్వాత మూడు సంతకాలతో పాటు.. మరికొన్ని కీలక నిర్ణయాలు చంద్రబాబు తీసుకునే అవకాశం ఉంది.

ఏపీ ప్రజలు ఆశిస్తున్నదేంటి? చంద్రబాబు ముందున్న లక్ష్యమేంటి? నవ్యాంధ్రలో నవశకం తీసుకురాబోతున్నారా?

Updated On : June 11, 2024 / 8:46 PM IST

Ap Development : ఇప్పటిదాక ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఇంకో లెక్క.. కుంటుపడిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కక్షలు, ప్రతీకారాలు లేని ప్రజాపాలనే లక్ష్యం. హోదా సేవ కోసమే కానీ, ఆర్భాటం కోసం కాదంటూ క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీఎం అంటే కూడా సాధారణ మనిషే అన్న ఆయన.. గత ఐదేళ్ల పాలనను కేస్ స్టడీగా తీసుకుని నవ్యాంధ్రలో నవశకం సృష్టిస్తామంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం, సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం వంటి అంశాలపై క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేశారు చంద్రబాబు.

పదవి వచ్చిందని విర్రవీగిన వారి అహంకారం కూలిపోయింది..
నవ్యాంధ్రలో నవశకం మొదలుకాబోతోంది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఏపీ సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ ప్రజలకు రాబోయే ఐదేళ్ల పాలనపై తన రూట్‌ మ్యాప్‌ను ప్రకటించారు చంద్రబాబు. ప్రజాపాలనే లక్ష్యంగా తమ నిర్ణయాలు, ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. పదవొచ్చిందని విర్రవీగిన వారి.. అహంకారం కూలిపోయిందని.. ఎన్డీయే కూటమికి దేశ చరిత్రలోనే అరుదైన విజయం దక్కిందన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు బాబు. అమిత్‌షా సభతో బీజేపీపై రాష్ట్రంలో నమ్మకం ఏర్పడిందని.. తన అనుభవంతో పేదరికాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తామన్నారు.

రాష్ట్రం పూర్తిగా శిథిలమైందంటున్న చంద్రబాబు..
14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రతీ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. పార్టీకి, తనకు వచ్చిన ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని పనిచేస్తూ ముందుకెళ్లారు. ఇప్పుడు ఏపీలో ఉన్న సమస్యలు, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు చంద్రబాబుకు సవాల్‌గా మారాయి. గత ఐదేళ్లలో సంక్షేమం మాత్రమే కొనసాగిందని.. అభివృద్ధి కుంటుపడిందని చెప్పిన టీడీపీ.. ఈ ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని.. అన్ని వర్గాలు దెబ్బతిని రాష్ట్రం పూర్తిగా శిథిలమైందంటున్న చంద్రబాబు..తమ పాలన బాగుంటుందని ప్రజలకు భరోసా కల్పించారు.

తప్పు చేసిన వారిని వదిలేది లేదు..
కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తామని ప్రకటించారు చంద్రబాబు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్లే ఢిల్లీలో అందరూ గౌరవించారని చెప్పారు. ఏపీ ఓటర్ల నిర్ణయం రాష్ట్ర చరిత్రలో నిలుస్తుందన్నారు. ఇక అధికారం చేపట్టేకంటే ముందే ఇండైరెక్ట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ఎందుకు వదిలి పెట్టకూడదనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అదొక అలవాటుగా మారిపోతుందన్నారు. అందుకే చట్టపరంగా వారిని కచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు చంద్రబాబు. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని వినయంగా మాత్రమే ఉండాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు చంద్రబాబు.

రాష్ట్రాన్ని గెలిపించాల్సిన బాధ్యత మాపై ఉందన్న బాబు..
గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చానని.. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవసభగా చేసి అడుగుపెడతానని చెప్పానని గుర్తు చేశారు చంద్రబాబు. తన శపథాన్ని ప్రజలు గౌరవించారని.. తన మాటను గౌరవించిన ప్రజలను నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తన కుటుంబానికి అవమానం జరిగిందని చెప్పారు చంద్రబాబు. ప్రజలు గెలిచారు.. రాష్ట్రాన్ని గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.

సీఎం కూడా మామూలు మనిషే..
సీఎం పర్యటనల సందర్భంగా షాపులు బంద్‌ చేయడం, రోడ్లు మూసేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవని క్లారిటీ ఇచ్చేశారు. సీఎం కూడా మామూలు మనిషే. మామూలు మనిషిగానే వస్తానన్నారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు తామంతా సామాన్య వ్యక్తులుగానే ప్రజల వద్దకు వెళ్తామని.. ప్రజల్లో ఒకరిగా ఉంటామని చెప్పుకొచ్చారు చంద్రబాబు.

ప్రజలు ఇబ్బంది పడే విధంగా రూల్స్ మార్చొద్దు..
హోదా అనేది సేవ కోసమేనని.. తాము కూడా సామాన్య మనుషులమేనన్నారు చంద్రబాబు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని..ఐదు నిమిషాలు ఆలస్యం అయినా పర్వాలేదన్నారు. సిగ్నల్ సిగ్నల్ మధ్య ఒక నిమిషం గ్యాప్‌ ఉంటే చాలని.. మళ్లీ చెబుతున్నా.. తన కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్ అస్సలు ఆపొద్దన్నారు చంద్రబాబు. ప్రజలు ఇబ్బంది పడే విధంగా రూల్స్ మార్చవద్దని పోలీసులకు సూచనలు చేశారు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదని.. ప్రజాహితం కోసమే పని చేస్తామన్నారు. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందన్నారు. స్టేట్‌ ఫస్ట్ అనే నినాదంతో ముందు కెళ్తామన్నారు.

తొలి సంతకం దానిపైనే..!
ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేసే అవకాశం ఉంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెట్టే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్‌ను 4 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెన్షన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
ప్రమాణ స్వీకారం తర్వాత మూడు సంతకాలతో పాటు.. మరికొన్ని కీలక నిర్ణయాలు చంద్రబాబు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. యువతకు 3వేల నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే రైతుకు 20వేల ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 1500 ఆర్థిక సాయం అమలుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్లు, స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15వేల మంజూరు వంటి కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.

Also Read : ప్రధాని మోదీ 3.0 ఎలా ఉండబోతుంది? లక్ష్య సాధనకు చేయాల్సింది ఏంటి?