మందుబాబులకు సీఎం జగన్ షాక్, ఇతర రాష్ట్రాల మద్యంపై నిషేధం

  • Published By: naveen ,Published On : October 26, 2020 / 05:11 PM IST
మందుబాబులకు సీఎం జగన్ షాక్, ఇతర రాష్ట్రాల మద్యంపై నిషేధం

Updated On : October 26, 2020 / 6:35 PM IST

liquor ban : ఏపీలో మద్యం ప్రియులకు సీఎం జగన్ గట్టి షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల మద్యంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకోవడాన్ని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ రాష్ట్రానికి వెలుపల లేదా లోపల కొనుగోలు చేసిన మూడు మద్యం బాటిళ్లు ఓ వ్యక్తి కలిగి ఉండటం… ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన మూడు లిక్కర్ బాటిళ్లను రాష్ట్రంలోకి తీసుకురావడం నేరం కాదని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 411 ప్రకారం స్వదేశీ తయారీ విదేశీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్‌) మూడు బాటిళ్లు, విదేశీ మద్యం మూడు బాటిళ్లు, 650 ఎం.ఎల్‌ 6 బీరు సీసాలు, 2 లీటర్ల కల్లు అనుమతి లేకుండా ఓ వ్యక్తి కలిగి ఉండేందుకు అవకాశం ఉందని గుర్తు చేసింది. పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలోకి మద్యం తీసుకొస్తున్న వారిపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధం అని కోర్టు తేల్చి చెప్పింది.

కాగా, రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కంకణం కట్టుకున్న సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించారు. భారీగా మద్యం ధరలు పెంచారు. అయితే మందుబాబులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడం షురూ చేశారు. దీనికి హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వీలు లేకుండా చేసింది. ఇతర రాష్ట్రాల మద్యంపై బ్యాన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఏపీలోని మందు బాబులకు గట్టి షాక్ అనే చెప్పాలి.