అమెరికాలోని తెలుగు విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం అండ

ఆన్‌లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది.
ఆ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఏపీ సీఎంఓ అధికారులు ఇప్పటికే ఓవర్సిస్ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపుతో అక్కడి పరిస్థితిపై మాట్లాడి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు అందించారు.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు ముందు జాగ్రత్తగా తమ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లోకి మార్పు చేశాయి. ఇదే సమయంలో ఇతర దేశాల విద్యార్థులు వారి వారి దేశాలకు వెళ్లి పోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఇటీవల ఒక ప్రకటన చేసింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయ్యే వచ్చే విద్యా సంవత్సరం వరకు వీరికి సమయం ఇచ్చింది.
ఈ పరిస్థితుల్లో తమ చదువులు, భవిష్యత్తుపై అక్కడి తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలో తెలుగు విద్యార్థులు 47 వేల మంది చదువుతుండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 26 వేల మంది ఉన్నారు. వీరి పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూఎస్‌లోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని వారికి అండగా ఉండాలని ఆదేశించింది.
కరోనా వైరస్ కారణంగా కోర్సులను వర్సిటీలు ఆన్‌లైన్ మోడ్‌లోకి తాత్కాలికంగా మార్పు చేశాయని, ఇందులో తమ పొరపాటు ఏమీ లేదని, రెగ్యులర్ కోర్సుల్లో చేరిన తమకు ఇబ్బంది రాకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్ అధికారులకు, వర్సిటీల ప్రెసిడెంట్లకు విద్యార్థుల ద్వారా వినతులు ఇప్పించింది.
వినతుల వెల్లువ
36 వర్సిటీలకు చెందిన విద్యార్థులు అందిస్తున్న వినతులతో ఆయా వర్సిటీలు ఇప్పటికే యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ లేఖలు రాస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల తలెత్తే సమస్యలను అందులో పొందు పరిచాయి.
తెలుగు విద్యార్ధులు ఎక్కువ ఉన్న యూనివర్సిటీలు
జార్జియాటెక్, క్లెమ్స్‌న్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజీ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ అలబామా, లామర్ వర్సిటీ, డ్యూక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమోరీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా, జార్జియా స్టేట్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ డెంటన్, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టి, కింగ్స్‌విల్లే వర్సిటీ తదితరాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు.
ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉన్నత విద్యనభ్యసించడానికి యూఎస్‌లోని వర్సిటీల్లో చేరాంమని, కరోనా వైరస్ వల్ల మమల్ని దేశం విడిచి వెళ్ళమని చెప్పటం ఆందోళన కలిగించిందనివాపోయారు విద్యార్ధులు. మా పట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చూపిన చొరవకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మా కోర్సులను ఆన్‌లైన్‌లోకి మార్పు చేసి బోధన కొనసాగిస్తున్నాయని. మా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ విధానాన్ని ఎంచుకున్నాయి.
వైరస్ తగ్గాక మళ్లీ రెగ్యులర్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈలోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు మమ్మల్ని దేశం విడిచి వెళ్లాలనడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాం. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగం ద్వారా మాకు మార్గనిర్దేశం చేస్తూ ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలని విద్యార్ధులు చెప్పారు.