AP Govt: ఏపీలోని పేద, మధ్య తరగతి ప్రజలకు గుడ్‌న్యూస్.. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
AP Govt : ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజుల భారాన్ని తగ్గించింది.

AP Govt
AP Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అనేక పథకాలను అమలు చేస్తుంది. అయితే, తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారాన్ని తగ్గించారు.
పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయితీల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో చేపట్టే జీప్లస్-1, ఆలోపు భవన నిర్మాణానికి అనుమతి ఫీజు రూపాయిగా నిర్ణయించింది. దరఖాస్తుతోపాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి డ్రాయింగ్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులిచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రతీయేటా రూ. 6కోట్ల ఫీజుల భారం తగ్గనుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రతీయేటా ఇళ్లు, అపార్టుమెంట్లు, ఇతర నిర్మాణాల అనుమతులకు సంబంధించి రూ.1500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలు 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకుంటున్న ఇళ్లు 25శాతం నుంచి 30శాతం వరకు ఉంటాయి. రెండు అంతస్తుల్లో వీరు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఫీజుల కింద రూ.3వేలు నుంచి రూ. 4వేలు చెల్లిస్తున్నారు. ప్ఱభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేద వర్గాల కుటుంబాలకు ఆ భారం తగ్గనుంది.
ఇళ్ల నిర్మాణానికే మాత్రమే రూపాయి ఫీజు వర్తిస్తుంది. అదే స్థలంలో దుకాణాల వంటివి నిర్మిస్తే వాటికి యథాప్రకారం ఫీజు చెల్లించాలి. 60 చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం ఉండి.. దాన్ని 50 గజాలకు కుదించి చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు రూపాయి ఫీజు వర్తించదు. ప్రభుత్వ, వివాదాస్పద స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నట్లు తనిఖీల్లో వెల్లడయితే వాటిని రద్దు చేయడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.