Meat Mart : ఏపీలో మాంసం మార్టులు
ఆంధ్ర ప్రభుత్వం మాంసం మార్ట్ లను తీసుకొస్తోంది. మొదట నగరాలు, పట్టణాల్లో ప్రారంభించనుంది.

Meat Mart
Meat Mart : దేశంలోనే తొలిసారి ఏపీలో మాంసం మార్టులు రానున్నాయి. దీనికోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రజలకు ఆరోగ్యకరమైన, మంచి మాంసం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మాంసం మార్టులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటు చేయనుండగా.. అక్కడ సక్సెస్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తారు. రూ.11.20 కోట్లతో 112 మార్ట్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
నానాటికి మాంసం వినియోగం పెరిగిపోతోంది. రాష్ట్రంలో మాంసాహారులు సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇటువంటి సమయంలో కల్తీమాంసం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇక మరోవైపు వైద్యులు కూడా మాంసాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ప్రోటీన్ అధికంగా మాంసంలోనే లభిస్తుందని, శరీరానికి సరైన ప్రోటీన్ అందితే కండరాలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు. ఇక కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే కూడా మాంసం తినాలని వైద్యులు తెలిపారు. కరోనా ప్రారంభంలో దారుణంగా పడిపోయిన చికెన్ ధరలు, వైద్యుల స్టేట్మెంట్ తో భారీగా ధరలు పెరిగాయి.
ఏపీలో మాంసాహార ఉత్పత్తుల వినియోగంలో 13.53 శాతం మేక, గొర్రె మాంసానిదే. ధర ప్రియమైనా ఆదివారం వచ్చిందంటే కోడి మాంసం, చేపలు, రొయ్యలకు దీటుగా మటన్ విక్రయాలు జరుగుతుంటాయి. 2.31 కోట్ల మేకలు/గొర్రెల సంపద కలిగి మాంసం ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది రాష్ట్రం. ఎగుమతుల్లో కూడా టాప్–10లోనే ఉంది.
సబ్సిడీపై మంజూరు
ఏపీ మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యూనిట్ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో నాలుగు, మిగిలిన కార్పొరేషన్ల పరిధిలో రెండు, ఇతర మునిసిపాల్టీల పరిధిలో ఒక్కటి చొప్పున సబ్సిడీతో కూడిన గ్రాంట్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు.