APPSC Group2 Exams: గ్రూప్ 2 వాయిదా వేయండి.. APPSCకి ప్రభుత్వం లేఖ

అభ్యర్థుల ఆందోళన ప్రభుత్వo దృష్టికి రాగానే న్యాయ అంశాలు, పరీక్ష వాయిదా సాధ్యాసాధ్యాలు పరిశీలించామన్నారు.

APPSC Group2 Exams: గ్రూప్ 2 వాయిదా వేయండి.. APPSCకి ప్రభుత్వం లేఖ

Updated On : February 22, 2025 / 8:23 PM IST

APPSC Group2 Exams: గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ కి కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాలపై ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

గ్రూప్ 2 అభ్యర్థుల్లో నెలకొన్న గందరగోళం అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు నేతలు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రోస్టర్ విధానంపై అభ్యర్థులు 3 రోజుల నుంచి ఆందోళన ప్రారంభించారని అన్నారు.

అభ్యర్థుల ఆందోళన ప్రభుత్వo దృష్టికి రాగానే న్యాయ అంశాలు, పరీక్ష వాయిదా సాధ్యాసాధ్యాలు పరిశీలించామన్నారు. మార్చి 11న న్యాయస్థానoలో దీనిపై విచారణ ఉన్నందున అప్పటివరకు పరీక్ష వాయిదా వేయమని ప్రభుత్వం తరఫున ఏపీపీఎస్సీ కి లేఖ రాశామన్నారు. రిజర్వేషన్ రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతమని నేతలకు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.

Also Read : ఏపీలో గ్రూప్ 2 వాయిదాపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

కాగా.. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల విషయంలో అభ్యర్ధుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్షల నిర్వహణ విషయంలో ఎటూ తేల్చకపోవటంతో ఏపీపీఎస్సీ తీరుపై గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది.

గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి నిన్ననే లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల విజ్ఞప్తులను తెలియచేస్తూ పరీక్ష వాయిదా కోరుతూ లేఖ రాసింది. నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఏపీసీఎస్సీ వర్గాలు స్పందించలేదు. దీంతో షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలుస్తోంది.

అసలు వివాదం ఏంటి? అభ్యర్థుల ఆందోళనలు ఎందుకు?
రోస్టర్ లో తప్పులు సరి చేయకుండా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించొద్దని అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించకపోతే ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుందని వాపోతున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ లోని రోస్టర్ విధానంలో లోపాలున్నాయని, వీటిని సరిచేశాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని అభ్యర్థులు కొన్ని రోజులుగా కోరుతున్నారు.

Also Read : వాడితే ఓ బాధ, వాడకపోతే మరో బాధ..! రుషికొండ భవనాలను ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..

రాష్ట్రంలో 899 పోస్టులు భర్తీకి 2023 డిసెంబర్ 7న గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ ఆగిపోయింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న (ఆదివారం) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. 13 ఉమ్మడి జిల్లాల్లో 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.