Gossip Garage : వాడితే ఓ బాధ, వాడకపోతే మరో బాధ….! రుషికొండ భవనాలను ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..

ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా విద్యుత్‌ బిల్లు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతి నెలా 40 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుందని అంటున్నారు. అదే పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే కరెంట్‌ యూసేజ్‌ రెండింతలు అవుతుందని అంచనా.

Gossip Garage : వాడితే ఓ బాధ, వాడకపోతే మరో బాధ….! రుషికొండ భవనాలను ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..

Updated On : February 22, 2025 / 1:40 AM IST

Gossip Garage : ఎన్నికలకు ముందు..ఆ తర్వాత..ఆ సౌధం చుట్టే చర్చ. భవిష్యత్ అవసరాల కోసం కట్టామని వైసీపీ..కాదు జగన్‌ కోసమే ప్యాలెస్‌ నిర్మించారని టీడీపీ..మాటకు మాటతో రచ్చ నడుస్తూనే ఉంది. విశాఖ సాగర తీరాన ఉన్న రుషికొండ భవనాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఢిల్లీలో శీష్‌ మహల్‌ను మ్యూజియం చేస్తామని బీజేపీ సర్కార్ చెప్పడంతో..ఏపీలో రుషికొండ నిర్మాణాలను ఏం చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రుషికొండ భవనాలను ఏపీ సర్కార్ ఏం చేయబోతోంది.? ప్రభుత్వమే వాడుకుంటుందా.? రిసార్టుల కోసం రెంట్‌కు ఇస్తారా.? కూటమి ప్రభుత్వం ఎందుకు ఓ నిర్ణయానికి రాలేకపోతోందా.?

ఆ భవనాలను దేని కోసం వాడుతారో?
అందమైన సాగర తీరం. దానిని ఆనుకుని ఉన్న కొండ. ఆ గుట్టను తవ్వి కట్టిన భవనాలు. ఆ నిర్మాణాల చుట్టూ వివాదం. ఏపీ ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు ఆ రచ్చ నడుస్తూనే ఉంది. వైసీపీ హయాంలో కట్టిన రుషికొండ భవనాలు..ప్రతీసారి ఏదో ఒక సందర్భంలో హాట్ టాపిక్‌ అవుతున్నాయి. ఆ భవనాలను దేని కోసం వాడుతారోనన్న ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. మొన్నటివరకు వివాదాస్పదంగా ఉన్న..ఆ ప్యాలెస్ కథ ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఢిల్లీలో శీష్‌ మహల్‌ వార్తల్లో నిలుస్తున్న వేళ.. విశాఖలో ఉన్న రుషికొండ భవనాలపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ప్రకృతిని ధ్వంసం చేసి, పర్యావరణాన్ని డ్యామేజ్‌ చేసి..వైసీపీ సర్కార్ ఆ భవనాలను కట్టిందని టీడీపీ ముందు నుంచి విమర్శిస్తూ వస్తోంది. అలా ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటివరకు రుషికొండ భవంతుల చుట్టూ ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. రాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులు వచ్చినప్పుడు అతిథి గృహాలుగా వాడేందుకు కట్టామని కొందరు వైసీపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. మరికొందరు జగన్‌ కోసమే నిర్మించాం, అయితే తప్పేంటన్నట్లుగా మాట్లాడారు.

Also Read : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అద్భుతమైన పథకం.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల విలువైన..

వాడితే ఓ బాధ, వాడకపోతే మరో బాధ..
ఇలా కేరాఫ్ కాంట్రవర్సీగా ఉన్న రుషికొండ భవనాలు..వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేశాయన్న చర్చ ఉంది. ఉత్తరాంధ్రలో పార్టీ ఓటమికి ఆ భవనాలు ఓ కారణమని ఆ పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితి. ఎవరు కట్టుమన్నారు..చెప్తే వినలేదని కూడా పలువురు నేతలు ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.

అలా రచ్చకు దారి తీసిన రుషికొండ భవనాలపై ఇప్పెడెలా ముందుకెళ్లాలనే దానిపై కూటమి సర్కార్ కొన్నాళ్లుగా తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వ అవసరాలకే వాడుకుందామా లేక ప్రైవేటుకు ఇద్దామా అనేదానిపై ఇంటర్నల్‌గా చర్చలు జరుపుతూనే ఉందట. అయితే ఈ భవనాలను వాడితే ఓ బాధ..వాడకపోతే మరో బాధ అన్నట్లుగా ఉందట పరిస్థితి

ఇప్పటికే ఖాళీగా ఉన్న ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెలా లక్షల్లో ఖర్చవుతోంది. నిర్వహణ సామర్థ్యం, నైపుణ్యం ఉన్న సిబ్బంది లేరు. వీటిని రిసార్టులుగా మార్చాలన్నా అక్కడి నిర్మాణాలు అందుకు తగ్గట్లు లేవు. దీంతో వచ్చే ఆదాయం కన్నా నిర్వహణ భారం ఎక్కువవుతుందని భావిస్తున్నారు. అందుకే రుషికొండ భవనాలను ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

ఈ భవనాల నిర్వహణకే ప్రతీ రోజు లక్ష వరకు ఖర్చు..
రుషికొండపై 9.88 ఎకరాల్లో 7 భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కట్టిన ఈ భవనాల నిర్వహణకే ప్రతీ రోజు లక్ష వరకు ఖర్చు అవుతుందని ఇంజినీరింగ్‌ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ భవనాలను పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే 100 మంది వరకు సిబ్బంది అవసరమట. మరో 50 మంది షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుందని..ఇప్పటికే కొన్ని వస్తువులు పాడైనట్లు చెబుతున్నారు.

ఇక రుషికొండ భవనాలకు కరెంట్‌ బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయట. ప్రతి నెలా సగటున 6 లక్షలపైనే బిల్లు వచ్చిందట. ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా విద్యుత్‌ బిల్లు బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న భవనాలకే ప్రతి నెలా 40 వేల నుంచి 60 వేల యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుందని అంటున్నారు. అదే పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే కరెంట్‌ యూసేజ్‌ రెండింతలు అవుతుందని అంచనా.

Also Read : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. మరో ఎలక్షన్ హామీ అమలు.. ఏప్రిల్‌ నుంచి..

భవనాల దగ్గర 10వేల 4 చదరపు మీటర్లలో 58 రకాల మొక్కలు నాటారు. వీటిలో చాలావరకు విదేశాల నుంచి తెచ్చినవే. వాటి నిర్వహణ సరిగ్గా లేక చాలా మొక్కలు ఎండిపోయాయి. అయితే విలువైన ప్రభుత్వ ఆస్తిని నిరుపయోగంగా ఉంచడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌ హయాంలో నిర్మించిన శీష్‌మహల్‌ చర్చకు వచ్చింది. అక్కడి బీజేపీ ప్రభుత్వం శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామంటోంది. ఏపీలో పవర్‌లో ఉన్న ఎన్డీయే సర్కార్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటుందా అన్న చర్చ మొదలైంది.

రుషికొండను ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారా లేక ప్రైవేటుకు ఇస్తారా అన్నది ఇంకా తేలడం లేదు. శీష్‌మహల్‌ విషయంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం ప్రకటించడంతో..ఏపీలో కూటమి సర్కార్ కూడా రుషికొండ భవనాలపై ఏదో ఒకటి తేల్చాలని భావిస్తోందట. కూటమి ప్రభుత్వం రుషికొండ భవనాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.