పూర్తి స్థాయి బడ్జెట్‌పై చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు.. కొత్త పథకాల అమలుపై ఫోకస్..

ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది.

పూర్తి స్థాయి బడ్జెట్‌పై చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు.. కొత్త పథకాల అమలుపై ఫోకస్..

Updated On : August 18, 2024 / 5:04 PM IST

Ap Budget : కీలక నిర్ణయాల దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాలన చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా పూర్తి స్థాయి బడ్జెట్ వైపు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా కీలక శాఖలతో సమీక్షలు నిర్వహిస్తోంది. వచ్చే నెలఖారులో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలు దిశగానూ తాజాగా కూటమి నేతలు ఆలోచన చేస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది.

సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసే ఛాన్స్..!
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు జరపనుంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ అంచనాలను పంపాలని ఇప్పటికే అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఈ పూర్తి స్థాయి బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ లో సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపు చేయలేదు. ఈసారి బడ్జెట్ లో ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్న పథకాలకు నిధుల కేటాయింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెన్షన్ రూ.4వేలకు పెంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. దసరా నుంచి మరో రెండు స్కీమ్ లను ప్రారంభించాలని భావిస్తోంది.

ఆ రెండు పథకాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు..!
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల అమలు దిశగా కసరత్తు సాగుతోంది. ఈ రెండు పథకాలకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఈసారి ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. ఇక వచ్చే సంక్రాంతి వేళ అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తల్లికి వందనం, మహిళలకు రూ.1500 జమ వంటి నిర్ణయాలు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : చంద్రబాబు ప్రభుత్వం వెరైటీ శిక్ష.. ఆ 16 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లలో కలవరం..