ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాలివే.. రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ అలర్ట్.. కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు..
భారీ వర్షాల కారంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని...

AP Heavy Rains: ఏపీ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం భయాందోళనకు గురి చేస్తోంది. భారీ ఈదురుగాలులు వణికిస్తున్నాయి. పిడుగులు ప్రాణాలు తీస్తున్నాయి. వర్ష బీభత్సం నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో హోంశాఖ మంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితులపై ఆరా తీశారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి అనిత ఆదేశించారు. అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు హోంమంత్రి అనిత.
ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం బాపట్ల జిల్లాలో వాన దంచికొట్టింది. చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు మండలాల్లో భారీ శబ్దాలతో ఉరుములు, పెనుగాలులతో కూడిన వాన కురిసింది. చినగంజాం, పాత చీరాలలో పిడుగులు పడ్డాయి. చినగంజాంలోని రొంపేరు కాలువ సమీపంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారరు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్. ప్రకాశం,కృష్ణా,బాపట్ల, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. పిడుగులు కూడా పడొచ్చు. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఇక అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు
కురవొచ్చు. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించారు.
విజయవాడ నగరంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయవాడలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. భక్తుల భద్రతరీత్యా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ ను మూసివేశారు అధికారులు. శ్రీ కనక దుర్గానగర్ మార్గం గుండా భక్తుల రాకపోకలకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసి రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో మామిడి కాయలు సైతం ఈదురు గాలులకు రాలిపోవడంతో రైతులు దిగాలుగా ఉన్నారు. భారీగా ఈదురు గాలులకు వృక్షాలు కూలాయి.
భారీ వర్షాల కారంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. జిల్లాల్లో భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార, సహాయ సహకారాల కేంద్రాలు పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పార్థసారధి. అకాల వర్షం కారణంగా జిల్లాలో మామిడి పంట నష్టం పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: మొన్న రీ స్టార్ట్.. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్.. అమరావతికి భారీ ప్రాజెక్ట్.. దేశంలోనే తొలి..
విజయవాడ నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసిన నేపథ్యంలో జనజీవనానికి ఇబ్బంది తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టర్. నిర్మల కాన్వెంట్ జంక్షన్, పటమట, హనుమాన్ పేట, పాలీ క్లినిక్ రోడ్, జమ్మి చెట్టు సెంటర్ తదితర ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. రోడ్లపై విరిగి పడిన చెట్లను సిబ్బంది తొలగిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై నీరు నిలిచిపోకుండా విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది చర్యలు చేపట్టారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామంలో పిడుగుపాటుకు గడ్డం బ్రహ్మయ్య (50) మృతి చెందాడు. గేదెలను కాస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలై ఒక్కసారిగా పిడుగు పడటంతో బ్రహ్మయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
Also Read: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు? ఇప్పటివరకు ఓ లెక్క… ఇప్పుడో లెక్క
తిరుపతిలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గంట పాటు నగరాన్ని వణికించింది గాలివాన. పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. హోర్డింగ్ లు కూలాయి. పలు చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు, నాయుడుపేట, గూడూరులో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం పడింది. నాయుడుపేట, ఓజిలి మండలాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. ఓజిలి మండలం గొల్లపాలెంలో కార్తీక్ అనే బాలుడు, వద్దిగుంట కండ్రిక వద్ద ఆలం భాస్కర్ అనే వ్యక్తి పిడుగుపాటుతో మరణించారు.
ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రానున్న 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 60-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది.
ఇక అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయంది.
ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని చెప్పింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.