వారికి కొత్త ఇళ్లు..! వరదల్లో నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం సాయం..
ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం.

Ap Floods : వరదల్లో నష్టపోయిన వారికి సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తోంది. వరదల కారణంగా నష్టపోయిన వారికి ఈ నెల 17న సాయం అందించనుంది. ఇప్పటికే వరద నష్టంపై మంత్రులు అధికారులతో పలు దఫాలుగా సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఇప్పటివరకు లక్ష ఇళ్లలో నష్టం జరిగినట్లు అంచనా వేసింది ప్రభుత్వం. ఇళ్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరద వల్ల 2లక్షల 15వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేసింది ప్రభుత్వం. వీరికి కూడా సాయం అందించనుంది. వరదల కారణంగా దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు సైతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
వరద బాధితులకు ఈ నెల 17వ తేదీలోపు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వరదలతో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. భవిష్యత్తులో ఉప్పుటేరు, ఎర్రకాలువ వరదలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయి. బెజవాడ వాసులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వరద నీరు కాలనీలను ముంచెత్తింది. దీంతో చాలా మంది కట్టుబట్టలతో మిగిలారు. వరదల్లో సర్వస్వం కోల్పోయారు. ముఖ్యంగా సింగ్ నగర్, వాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరద బాధితుల వాహనాలు, ఆస్తులకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీసులో 29 కంపెనీలు మునిగిన వాహనాల బీమా క్లెయిమ్స్ కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాయి.
Also Read : ఇన్నాళ్లూ తనతో ఆడుకున్న ప్రత్యర్థులపై రోజా వేట స్టార్ట్ చేశారా?
భారీ వరదలతో విజయవాడలోని పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రజల వస్తువులు, సామాన్లు, వాహనాలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. చాలా మంది సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. ఇక.. చిన్న చిన్న షాపుల్లో వస్తువులు పూర్తిగా పాడైపోయాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. విజయవాడలో వరదలకు అత్యంత ప్రభావితమైపన ప్రాంతం అజిత్ సింగ్ నగర్. సెప్టెంబర్ 1న పొంగిన బుడమేరు వాగు.. పలు కాలనీలను ముంచెత్తింది.
Also Read : కిరణ్ కుమార్ రెడ్డికే పగ్గాలు? ఏపీపై బీజేపీ భారీ స్కెచ్..!